వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కాబోతోందంటూ చాలాకాలంగా తెలుగుదేశం పార్టీ పగటి కలలు కంటూనే వుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడూ అదే వాదన. కానీ, ఏళ్ళు గడుస్తున్నా వైఎస్ జగన్ బెయిల్ మాత్రం రద్దవలేదు. బెయిల్ నిబంధనల్ని తానెక్కడా ఉల్లంఘించలేదని పదే పదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోర్టుకి విన్నవిస్తున్నారు.
దాంతో, బెయిల్ రద్దుపై ఎంత రాజకీయం నడుస్తున్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. అయితే, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోరుతూ కోర్టును ఆశ్రయించాక వాతావరణం కాస్త గందరగోళంగా తయారైంది.
ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. వైఎస్ జగన్ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. సీబీఐ, కోర్టు విచక్షణకే వదిలేస్తున్నట్లు బెయిల్ రద్దు వ్యవహారంపై స్పందించింది. లిఖిత పూర్వక వాదనలు.. ఇలా వ్యవహారం నడుస్తూ నడుస్తూ వుంది. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆగస్టు సంక్షోభం తప్పదు.. టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా వుండాలి.. బులుగు మూకలు టీడీపీ నేతలపై దాడులు చేసే అవకాశం వుంది..’ అంటూ టీడీపీ మద్దతుదారులు కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలు పెట్టేశారు.
ఈ వ్యవహారంపై వైసీపీ గుస్సా అవుతోంది. వైసీపీకి చెందిన కొందరు నేతలు, ఈ దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేయడం గమనార్హం. ఏదిఏమైనా, రాజకీయ నాయకుల మీద కేసులు ఏళ్ళ తరబడి విచారణలో జాప్యం జరగడం అనేది ఇలాంటి రాజకీయ వివాదాలకే తావిస్తుంటుంది. న్యాయవ్యవస్థల మీద సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పడుతున్నాయంటే, దానికి కారణం ఆయా కేసుల్లో విచారణ నత్త నడకన సాగడం కూడా కావొచ్చన్నది న్యాయ నిపుణుల వాదన.
అయితే, రాజకీయ ప్రోద్బలంతో నమోదయ్యే కేసుల విషయంలో న్యాయస్థానాలు సైతం చెయ్యగలిగేదేమీ వుండదు. పసలేని వాదనలతో కేసులు పెట్టి, ఆ కేసుల విచారణ సందర్భంగా కావాలనే జాప్యం చేసేవారి కారణంగానూ ఇలాంటి సమస్యలొస్తున్నాయంటారు మరికొందరు. ఎవరి వాదనలు వారివి.