ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే, ఓ మంత్రికి సంబంధించిన ఆడియో టేపులు సోషల్ మీడియాలో లీక్ అవడం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ నేతలవిగా చెప్పబడుతున్న ఈ ఆడియో టేపుల కారణంగా అధికార పార్టీకీ, ప్రభుత్వానికీ చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఏర్పడింది. అవి ప్రత్యర్థుల రాజకీయ కుట్ర మాత్రమేనని సదరు నేతలు ఇప్పటికే వివరణ ఇచ్చారు. అయితే, ఆ టేపులపై విచారణ జరగాల్సి వుందంటూ అధికార పార్టీకి చెందిన ఓ మహిళా నేత, పైగా కీలక పదవిలో వునన నేత వ్యాఖ్యానించడంతో దుమారం ముదిరి పాకాన పడింది. నిజానిజాలు నిగ్గు తేలాలంటే విచారణ జరగాల్సిందే. పోలీసులకు ఫిర్యాదు చేశామని సదరు నేతలంటున్నారు. ఇంతకీ, విచారణ ప్రారంభమయ్యిందా.? లేదా.? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వ్యవహారాన్ని ఎలా తీసుకుంటున్నారు.?
‘జగన్ ఇలాంటి విషయాల్ని లైట్ తీసుకునే ప్రసక్తి వుండదు..’ అని మాత్రం వైసీపీ నేతలు చెబుతున్నారు. చిత్రమేంటంటే, ఆడియో టేపుల లీకేజీ టెన్షన్ ఎదుర్కొంటున్న ఇద్దరు నేతల్లో ఒకరు మంత్రి పదవి నిలబెట్టుకునేందుకు నానా తంటాలూ పడుతోంటే, ఇంకొకరు ఎలాగైనా ఈసారి మంత్రి పదవి దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. దాంతో, ఆ ఇద్దరికీ షాక్ తప్పదన్న ప్రచారం జరుగుతోంది. అవి నిజమైన ఆడియో టేపులా.? ఎవరన్నా మిమిక్రీ చేశారా.? అన్న విషయాల్ని పక్కన పెడితే, డ్యామేజీ మాత్రం గట్టిగానే జరిగిపోయింది అధికార పార్టీకి. ఈ విషయమై వైఎస్ జగన్ ఒకింత ఆగ్రహంతో వున్నమాట వాస్తవమే అయితే, విచారణ అత్యంత వేగంగా జరిగి, ఈపాటికే నిందితుల అరెస్ట్ జరిగిపోయి వుండాలన్నది ఇంకొందరి వాదన. మరీ, ఇంత పక్కగా ఆడియో టేపులు ఎలా లీక్ అయ్యాయి.? అన్నదానికి సంబంధించి మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది.