ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏకంగా న్యాయ వ్యవస్థ మీద యుద్ధం ప్రకటించటం చర్చనీయాంశం అయ్యింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద, హైకోర్టు జడ్జీల మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాయటం ఒక సాహసోపేతమైన నిర్ణయం అనే చెప్పాలి. ఎందుకంటే న్యాయ వ్యవస్థ తో గిల్లిగజ్జాలు పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపించటం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఇందిరా గాంధీ లాంటి నాయకురాలే కోర్టులతో జగడం పెట్టుకొని గెలవలేకపోయింది. అలాంటిది జగన్ ఏ ధైర్యంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది న్యాయ వ్యవస్థలో ఆయనకు అనుకూలంగా ఉండే న్యాయకోవిదులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సరిగ్గా పాలనా అనుభవం రెండేళ్ళైనా లేదు కానీ, దేశంలోనే బలమైన వ్యవస్థతో ఢీ అంటే ఢీ అంటూ తలపడటం ఏమిటో అర్ధం కావటం లేదు. అయితే ఇందులో సీఎం జగన్ ఆలోచన మరోలా ఉందని తెలుస్తుంది. అధికారం చేప్పట్టిన నాటి నుండి కోర్టులో ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అనుకూలంగా రాకపోగా, పాలనను ప్రభావితం చేసే విధంగా తీర్పు లు వస్తున్నాయి. మున్ముందు కూడా ఇలాగే జరిగే అవకాశం వుంది. ఇలాంటి సమయంలో దీని గురించి, అందులోని లోపాల గురించి ప్రజల్లోకి తీసుకోని వెళితే ఎలా ఉంటుంది..? ఎప్పటికైనా వాళ్లే అంతిమ తీర్పు ఇచ్చేది, ఇప్పటికే ఇళ్ల స్థలాల విషయంలో చంద్రబాబు కోర్టు లో కేసులు వేసి రాకుండా అడ్డుకుంటున్నాడు అనే అభిప్రాయం జనాల్లోకి బాగానే వెళ్ళింది.
అదే విధంగా ఈ విషయాన్నీ కూడా తీసుకోని వెళ్లి, వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయాలనీ అనుకుంటున్నా కానీ, కోర్టు లతో కలిసి చంద్రబాబు నాయుడు వాటిని అడ్డుకుంటున్నాడు అనే అభిప్రాయం కామన్ మెన్ లో కలిగేలా చేయాలనే ఉద్దేశ్యంతో జగన్ ఇలా చేసివుండొచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి. దీని వలన ప్రభుత్వానికి సానుభూతి కలిగే అవకాశం ఎక్కువగానే ఉంది. అదే సమయంలో జనాల్లో మరో వాదన కూడా వినిపిస్తుంది. జగన్ తన మీద వున్నా కేసుల నేపథ్యంలోనే న్యాయ వ్యవస్థ మీద ముందుగా ఆరోపణలు చేస్తున్నాడు.
రేపొద్దున ఏమైనా తేడా జరిగి జగన్ తన మీద ఉన్న కేసుల వలన ఆయన అరెస్ట్ అయితే అది కక్ష సాధింపు చర్యలో భాగమని, న్యాయ వ్యవస్థను ప్రశ్నించినందుకే జగన్ ను అరెస్ట్ చేశారని చెప్పుకుంటూ, సింపతీ సంపాదించవచ్చనే ఉద్దేశ్యంతో కూడా జగన్ ఇలా చేసి ఉండవచ్చు అనే అభిప్రాయం వినిపిస్తుంది. మరి ఇందులో ఏ వెర్షన్ ఎంత వరకు నిజం..? జగన్ తీసుకున్న నిర్ణయం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.