జగన్.. అనగానే ఎవరు గుర్తుకు వస్తారు? ఇంకెవరు.. ఏపీ సీఎం జగన్ గుర్తుకువస్తారు.. అంటారా? అవును.. నిజమే.. జగన్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఏపీ సీఎం పేరే.. కానీ.. ఆ పేరుతో ఆయనొక్కరే లేరు కదా. బోలెడు మందికి జగన్ అనే పేరు ఉంది.
సరే.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ గురించే మాట్లాడుకుందాం. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కోసం జగన్.. ఏపీ నుంచి ఎన్నికల ప్రచార వాహనాలను పంపించారంటూ వార్తలు వచ్చాయి. అప్పట్లో వాళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది అది వేరే విషయం అనుకోండి. అప్పట్లో ఏపీ వాహనాలు.. తెలంగాణలో హల్ చల్.. అంటూ బోలెడు వార్తలను చదివాం.
తాజాగా.. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ అటువంటి ప్రచారమే మళ్లీ జరుగుతోంది. దానికి కారణం.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల వాహనాలపై రావాలి జగన్.. కావాలి జగన్ అంటూ రాసి ఉండటమే.
అదేంటి.. టీఆర్ఎస్ పార్టీ ప్రచార వాహనాలపై ఆ స్లోగన్ ఎందుకు ఉంది. కొంపదీసి.. జగన్, కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం ఏదైనా ఉందా? మళ్లీ ఎన్నికల ప్రచారం కోసం తన పార్టీ ప్రచార వాహనాలను పంపించారా? ఏంది అని అనుకోకండి. ఎందుకంటే.. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి తప్పుడు ప్రచారమే సాగుతోంది.
అసలు.. జగన్ జీహెచ్ఎంసీ ఎన్నికలను పట్టించుకునే మూడ్ లో లేరు. అందులోనూ ఆయన తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టరు కూడా. ఆయనకు ఏపీతోనే సరిపోతుంది.
మరి.. జగన్ పేరు ఎక్కడినుంచి వచ్చిందంటారా? అక్కడికే వస్తున్నా.. జగద్గిరిగుట్ట ఉంది కదా. అక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి పేరు జగన్. కాబట్టి.. తన ప్రచార వాహనం మీద.. తనకు నచ్చిన స్లోగన్ రావాలి జగన్.. కావాలి జగన్ .. అని రాయించుకున్నారు తప్పితే.. ఇక్కడ ఏపీ సీఎం జగన్ కు సంబంధమే లేదు. అందులోనూ ఆ వాహనాలు ఏపీ నుంచి రాలేదు.
సోషల్ మీడియాలో మాత్రం దీనిపై ట్రోల్స్ ఆగడం లేదు. నెటిజన్లు.. ఆ ఫోటోపై తెగ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా.. జగన్ పేరు.. తెలంగాణ ఎన్నికల్లోనూ మారుమోగిపోతోంది.