ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు మేలుచేకూరే సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో అసలు వెనుకాడడని ఎన్నో సార్లు నిరూపించారు. సవాలు విసిరే ఆర్థిక సమస్యల్ని అస్సలు లెక్క చేయని వ్యక్తిగా, లక్ష్యాన్ని చేరుకోవటమే తప్పించి.. లక్ష్య సాధనలో అడ్డుగా ఉంటే సమస్యల్ని పెద్దగా కేర్ చేయని ఆయన సంక్షేమ పథకాల విషయంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్తవాటిని తెర మీదకు తీసుకొస్తుంటారు. తాజాగా నాలుగేళ్లలో సుమారుగా రూ.2340 కోట్లు ఖర్చు అయ్యే అలాంటి పథకాన్నే మరొకటిని తెర మీదకు తెస్తున్నారు. ఇదివరకే వైఎస్ జగన్ పలు వర్గాల వారికి భారీ ఎత్తున సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నారన్న విషయం తెలిసిందే.. అయితే తాజాగా రైతులకు తరచూ పెద్ద సమస్యగా పరిగణించే వ్యవసాయ బోర్ల విషయంలో ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నారు..
ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు.. కాగా వైఎస్సార్ జలకళ పేరుతో షురూ చేసిన ఈ పథకం రైతులకు ఒక వరంగా మారుతుందని, ఈ పథకంలో భాగంగా రైతులకు పొలాల్లో ఉచితంగా బోర్లు వేయాలన్న నియమాన్ని ప్రభుత్వం అమలు చేయాలని అనుకుంటుందని ఆయన పేర్కొన్నారు.. ఇక ఈ పథకంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి.. పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున డ్రిల్లింగ్ కాంట్రాక్టు ఏజెన్సీని ఇప్పటికే ఎంపిక చేశారు. కాగా దీనికి అర్హులుగా కనిష్ఠంగా 2.5 ఎకరాలు.. గరిష్ఠంగా 5 ఎకరాలు ఉన్న రైతులు గ్రూపుగా ఏర్పడి బోరు కోసం దరఖాస్తు పెట్టుకోవాలని, ఇదేకాకుండా అప్లికేషన్ పెట్టుకునే చోట అంతకు ముందు బోరు ఉండకూడదనే కండీషన్ పెట్టారు..
కాగా అర్హత కలిగిన వారు గ్రామ సచివాలయంలో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ పథకంలో రైతులు ఒక్క రూపాయి ఖర్చు చేయకుండానే బోర్లు వేయించుకునే వీలును కల్పిస్తుంది అధికార పార్టీ.. ఇక పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ఈ పథకాన్ని రేపటి నుంచి అమలు చేయనున్నారు అధికారులు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరో 2లక్షల బోర్లు తవ్వించటం లక్ష్యంగా పెట్టుకున్నారట కూడా.. అయితే పేదల సంక్షేమ పథకాల విషయంలో దూకుడు ప్రదర్శించే వైఎస్ జగన్ సర్కారుకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికి తాజా జలకళతో మరో మెట్టు పైకెక్కుతారని అంటున్నారట రాజకీయ పరిశీలకులు..