నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత కొంత కాలంగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో మార్మోగిపోతున్న పేరు, అధికార వైసీపీ పార్టీకి కొరకరాని కొయ్యగా తయారైన నిమ్మగడ్డ. సీఎం జగన్ తో ఢీ అంటే ఢీ అంటూ పోరాటం చేస్తూ ఒక వర్గానికి హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా పంచాయితీ ఎన్నికల విషయంలో అధికార వైసీపీ పార్టీకి మూడు చెరువుల నీళ్లు తాగించిన ఘనత నిమ్మగడ్డ రమేష్ కు చెందుతుంది.
ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవిలో ఉన్నంత కాలం పంచాయితీ ఎన్నికలకు వెళ్లకూడదని అనేక ప్రయత్నాలు చేసిన అధికార వైసీపీ పార్టీ, కోర్టు ఆదేశాలు మేరకు పంచాయితీ ఎన్నికలకు ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. అయితే అలాంటి నిమ్మగడ్డ పదవిలో ఉండగానే సీఎం జగన్ ధైర్యంగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళటానికి కూడా సిద్ధం కావటం సర్వత్రా ఆసక్తికరంగా మారిపోయింది.
నిజానికి పంచాయితీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు అంటూ ఏవి వుండవు, గ్రామాల అభివృద్ధి కోసం ఏనాడో ఈ చట్టసవరణ చేశారు. దీనితో గెలిచిన చాలా మంది తాము అధికార పార్టీ నేతలమనే చెప్పుకుంటారు, టీడీపీ, జనసేన సానుభూతి పరులు కూడా పనులు జరగటం కోసం వైసీపీ వైపు రావటం జరుగుతుంది, కానీ మున్సిపల్ ఎన్నికలు మాత్రం పార్టీ గుర్తుల మీదే జరుగుతాయి. కాబట్టి ఏ పార్టీ సత్తా ఏమిటో ఈ ఎన్నికల్లో తెలిసిపోతుంది.
ఇన్నాళ్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాడు అనే పేరుంది. అలాంటి వ్యక్తి చేతుల మీదగానే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పించటం చూస్తుంటే నిమ్మగడ్డ వేలితో చంద్రబాబు కంట్లో పొడిచినట్లే అంటూ రాజకీయ విశ్లేషకులు చెపుతున్న మాట. అధికారంలో వైసీపీ ఉండటంతో ఎన్నికల్లో ఎడ్జ్ అనేది వైసీపీ వైపునే ఉంటుంది. ఇప్పటికే అనేక మున్సిపాలిటీ లో వైసీపీ కి అనుకూలమైన గాలి వీస్తుంది. ఈ దశలో టీడీపీని చిత్తుగా ఓడించి, అటు చంద్రబాబుకు ఇటు నిమ్మగడ్డ కు గట్టి సమాధానం చెప్పవచ్చు అనేది జగన్ వ్యూహమని కొందరు అంటున్నారు.
ఇప్పుడు అదే భయం టీడీపీ నేతల్లో కనిపిస్తుంది. పంచాయితీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేవు కాబట్టి, వచ్చిన పంచాయితీల కంటే ఎక్కువగా చూపించుకొని సంబరాలు చేసుకున్న పెద్దగా పట్టించుకోలేదు, కానీ మునిసిపాలిటీలో అసలు లెక్క ఏమిటో తేలిపోతుంది. ఇక్కడ కానీ పెద్ద సంఖ్యలో ఓటములు ఎదురైతే 2023 ఎన్నికల్లో ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవు. మరి నిమ్మగడ్డను ఉపయోగించి జగన్ పన్నిన ఈ ఉచ్చు నుండి టీడీపీ ఎలా బయట పడుతుందో చూడాలి .