ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 300 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించిన 1,43,600 టిడ్కో ఇళ్లను ఒక్క రూపాయి తీసుకుని లబ్ధిదారులకు అందించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక సంఘాల్లో షియర్‌వాల్ సాంకేతికతతో జీ ప్లస్ 3 అపార్ట్‌మెంట్ల తరహాలో వీటిని నిర్మించారు. ఇప్పటి వరకు టిడ్కో కాలనీగా పిలుస్తున్న ఈ పథకం పేరును ఇకపై ప్రధానమంత్రి ఆవాస్ యోజన-వైఎస్సార్ జగనన్ననగర్‌గా మారుస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇక 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల ఇళ్లకు లబ్ధిదారుల వాటాలో 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు కూడా ప్రభుత్వం తెలిపింది. 365 చ.అ. ఇళ్లకు రూ.50 వేల చొప్పున, 430 చ.అ. ఇళ్లకు లక్ష చొప్పున ఆయా లబ్ధిదారులు చెల్లించవలసి వుంది. ఇందులోనే సగం వరకు రాయితీ ప్రకటించారు.
ఈ విషయంలో ఇప్పటికే పూర్తి మొత్తాన్ని చెల్లించిన వారికి సగం మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అంతేకాదు, ఈ ఇళ్ల కోసం ఇప్పటికే లబ్ధిదారుని వాటా చెల్లించి, ఆపై ప్రభుత్వ ఇళ్ల పట్టాల పథకంవైపు ఆసక్తి చూపిన వారికి పూర్తి మొత్తాన్ని ఇచ్చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.