తెలుగు రాష్ట్రాల్లో కూడా దేవుళ్లను అద్దం పెట్టుకొని రాజకీయాలు చేయడం నాయకులు ప్రారంభించారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో బాగా రగులుతోంది. కొన్ని రోజుల క్రితం అంతర్వేదిలో జరిగిన రథం తగలబడటం అనే ఘటనతో ఈ తరహా రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏ నాయకుడు ఏ మతానికి చెందిన వ్యక్తని చెప్పడానికి ఇతర పార్టీల నేతలు తెగ ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమలను దర్శించుకోవడం పెద్ద సంచలనంగా మారింది. ఆయన అక్కడ డిక్లరేషన్ పెడతారో లేదో అనే విషయంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
జగన్ డిక్లరేషన్ పై సంతకం పెడతాడా!
తిరుమల శ్రీవారిని అన్యమతస్థులు ఎవరు దర్శించినా డిక్లరేషన్ ఇవ్వడం సంప్రదాయంగా వస్తుంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తిరుమలను సందర్శించినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి , హిందు మత సంప్రదాయాలను గౌరవించాలని టీడీపీ, బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ వాదనపై వైసీపీ నాయకులు స్పందిస్తూ గతంలో సోనియా గాంధీ, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు డిక్లరేషన్ లు ఇవ్వలేదన్న విషయాన్ని పదే పదే చెబుతున్నాయి. గత ఏడాది స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు కూడా జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదు.
టీడీపీ ఎంత రాజకీయాలు చేస్తుందా!
గతంలో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలను దర్శించుకున్నారు. అయితే అప్పుడు కూడా ఆయన డిక్లరేషన్ పై సంతకం పెట్టలేదు. అప్పుడు టీడీపీ నేతలు అసలు ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం టీడీపీ నాయకులు ఈ విషయాన్ని పెద్దది చేసి చూపించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నాయకులు కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లిన తరువాత డిక్లరేషన్ పై సంతకం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.