మరోసారి ప్రధాని నరేంద్రమోడీని కలవడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్లడంపై రాజకీయ విమర్శలు, ఆరోపణలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ఢిల్లీ వెళ్తున్నారని వైసీపీ నాయకులు చెప్తుంటే, టీడీపీ నాయకులు మాత్రం జగన్ ఢిల్లీ వెళ్లడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
కేసుల మాఫీ కోసమే వెళ్తున్నారా!
వైఎస్ జగన్ ఢిల్లీకి వెళుతున్నది కేసుల మాఫీ కోసం మాత్రమే అన్నది టీడీపీ సహా ఇతర విపక్షాలు చేస్తున్న విమర్శ. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైఎస్ జగన్ సర్కార్‌కి అస్సలేమాత్రం చిత్తశుద్ధి లేదని టీడీపీ ఆరోపిస్తోంది. కేసులు మాఫీ కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీపై ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నారని, రాష్ట్రానికి కేంద్రం మోసం చేస్తున్నప్పటికీ కేసుల భయంతో కేంద్రాన్ని ఎదురించలేకపోతున్నారని టీడీపీ నాయకులు చెప్తున్నారు. తనపై ఉన్న కేసులు రానున్న రోజుల్లో ఇబ్బందులు వస్తాయని భావించిన, వాటి నుండి తాను అధికారంలో ఉన్నప్పుడే బయటపడాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. జగన్ తన స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని కూడా తాకట్టు పెట్టడానికి వెనకాడరని టీడీపీ నేతలు చెప్తున్నారు.
నిధులను కూడా జగన్ అడగలేడా !
పోలవరం ప్రాజెక్టు సహా, రాష్ట్రంలో అనేక అంశాలకు సంబంధించి కేంద్రం నుంచి పెద్దయెత్తున బకాయిలు రావాల్సి వుందనీ, వాటన్నిటినీ వసూలు చేయలేని చేతకానితనం రాష్ట్ర ప్రభుత్వానిదని టీడీపీ విమర్శిస్తోంది. జీఎస్టీ బకాయిల విషయమై తెలంగాణ, కేంద్రాన్ని నిలదీస్తోంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇందుకు భిన్నంగా వుంది. పెద్ద మొత్తంలో అప్పులు చేసుకోవడానికి కేంద్రం వెసులుబాటు కల్పిస్తే చాలన్న ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రానికి అదనంగా 7 వేల కోట్లు అప్పు చేసుకోవడానికి అవకాశం కల్పించిన విషయం విదితమే. కేంద్రం, రాష్ట్రానికి న్యాయ బద్ధంగా ఇవ్వాల్సిన నిధులు ఇస్తే.. కొత్తగా అప్పు చేయాల్సిన అవసరం రాష్ట్రానికి వుండదు. వైసీపీ ప్రభుత్వం మాత్రం కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతుంది.