పసుపుని ఔషధాల గనిగా పరిగణిస్తారు. పసుపులో ఉండే ఎన్నో ఔషధ గుణాలు అనేక వ్యాధులను నయం చేయటంలో ఉపయోగపడతాయి. పూర్వకాలం నుండి పసుపుని ఆయుర్వేదంలో ఔషధాల తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు మనం తినే ఆహార పదార్థాలలో పసుపు లేకుండా చేసే వంటలు చాలా అరుదు. పసుపులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల దీనిని మనం తినే ఆహార పదార్థాలలో వేసి తయారుచేస్తారు. అయితే పసుపులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయని మోతాదుకు మించి వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. పసుపు ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి గుణాలు ఎక్కువగా ఉంటాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులతో బాధపడేవారు పాలలో పసుపు వేసుకొని తాగటం వల్ల ఈ అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ప్రతిరోజు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో పసుపు కలిపి తాగటం వల్ల సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. అయితే ఆరోగ్యానికి మంచిదని మోతాదుకు మించి పసుపు తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే ఐరన్ పొడిబారటం ప్రారంభిస్తుంది. దీంతో అలసట, నీరసం వంటి సమస్యలు తలెత్తడమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
సాధారణంగా కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల డయేరియా వ్యాధి వస్తుంది. కానీ కొన్ని సందర్భాలలో పసుపు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల కూడా డయేరియా సమస్య వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం పొట్టలోని గ్యాస్ట్రిక్ డక్ట్ సరిగా పనిచేయకుండా చేస్తుంది, దీని కారణంగా డయేరియా సమస్య తలెత్తుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో అందరినీ ఎక్కువగా వేధిస్తున్న సమస్యలలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం. అయితే ఈ సమస్య రావటానికి పసుపు అధికంగా తీసుకోవడం కూడా ఒక కారణం. మోతాదుకు మించి పసుపు తీసుకోవడం వల్ల పసుపులో ఉండే ఆక్సలేట్ పరిమాణం కిడ్నీలో రాళ్లు ఏర్పడేలా చేస్తుంది. అందువల్ల ఆహార పదార్థాలు తయారు చేసే సమయంలో పసుపును తగిన పరిమాణంలో మాత్రమే ఉపయోగించటం మంచిది.