Platelet Count: రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ తగ్గిందా? ప్లేట్ లెట్ కౌంట్ పెంచుకోవటం ఎలా?

Platelet Count: రక్తంలో తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి అనడంలో సందేహం లేదు.తెల్ల రక్తకణాలు రోగ నిరోధకశక్తి గా పని చేస్తూ శరీరం రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. ఎర్ర రక్తకణాలు వాటిలో ఉండే హిమోగ్లోబిన్ ద్వారా శరీరం మొత్తం ఆక్సిజన్ ను అందజేస్తాయి. ఇక మిగిలినవి ప్లేట్ లెట్లు. ఇవి ఎక్కువగా శరీరం మీద గాయం అయినపుడు రక్త స్రావం జరగకుండా గడ్డ కట్టడానికి తోడ్పడతాయి. ప్లేట్ లెట్స్ తక్కువ అయినా, లేదా వాటి పని తీరు బాగలేకపోయిన, వాటి నాణ్యత తక్కువ అయినా, శరీరానికి ఎటువంటి గాయం లేకపోయినా రక్త స్రావం జరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఒక వ్యక్తిలో 1.5 లక్షల నుండి 4.5 లక్షల వరకు ప్లేట్ లెట్స్ ఉంటాయి. ఇవి అందరిలో ఒకేలాగా ఉండవు. వీటి జీవిత కాలం 7 నుండి 10 రోజులు.కొత్త ప్లేట్ లెట్స్ ఎముక మజ్జ లో ఏర్పడి మళ్ళీ రక్తంలోకి చేరుతాయి. గాయాలు అయిన సమయంలో రక్తాన్ని గడ్డ కట్టించి ప్రాణ రక్షణకు ఉపయోగపడే కణాలు ప్లేట్ లెట్స్.

సాధారణంగా మనిషి ఏదైనా వ్యాధికి గురైనప్పుడు ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గుతుంది. ప్లేట్ లెట్స్ అనేవి డెంగ్యూ, మలేరియా, వైరల్ ఇన్ఫెక్షన్ లకు గురైనప్పుడు అధిక మొత్తంలో తగ్గుతాయి. కొంతమందికి పుట్టుకతో వచ్చిన జన్యుపరమైన లోపాల వల్ల కూడా ప్లేట్ లెట్స్ తగ్గుతాయి. ఈ మధ్య కాలంలో ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రక్తం పల్చ పడటానికి కొన్ని రకాల మందులను వినియోగిస్తున్నారు, వీటి వల్ల కూడా ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది. డెంగ్యూ జ్వరం వస్తే తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, వస్తుంటాయి. దీని వల్ల ప్లేట్ లెట్స్ తగ్గే అవకాశం ఉంది. శరీరంలో ప్లేట్ లెట్స్ తగ్గిపోతే నోటి లోపలి పొరలలో కానీ,శరీరం లోపల కానీ రక్తస్రావం జరుగుతుంది.

శరీరంలో ప్లేట్ లెట్స్ సంఖ్య 10 వేల కన్నా తగ్గితే వాటిని ఎక్కించాల్సి ఉంటుంది. శరీరానికి తనంతట తానే ప్లేట్ లెట్స్ ను ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉంటుంది. అత్యవసర పరిస్థితులలో మాత్రమే ప్లేట్ లెట్స్ ను ఎక్కించాలి. అయితే ఇవి మనం తీసుకునే ఆహరం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ప్లేట్ లెట్స్ పెరగాలంటే రోజుకు రెండు సార్లు ఆఫ్రికాట్ పండ్లను తినాలి. ఎండు ఖర్జూరం, బొప్పాయి, కివి పండ్లను తినటం, బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల కూడా ప్లేట్ లేట్స్ త్వరగా వృద్ధి చెందుతాయి. దానిమ్మ పండ్లను తినటం వల్ల కూడా రక్తహీనత సమస్య తగ్గి ప్లేట్ లెట్స్ కూడా పెరుగుతాయి. క్యారెట్ ను తరచు తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య తగ్గి, ప్లేట్ లెట్ కూడా పెరుగుతాయి. డెంగీ వ్యాధితో బాధపడి ప్లేట్ లెట్స్ సమస్యతో బాధపడేవారు ఈ ఆహారపు అలవాట్లను రోజులో భాగం చేసుకుంటే త్వరగా రికవరీ అవుతారు.