తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలాంటి మొండిఘటం అనే విషయం చాలా మందికి తెలుసు, బ్రతిమలాడితే లొంగుతాడుకాని , బెదిరిస్తే మాత్రం అంతకు అంత తెగించే రకం ఆయన. ఆ ధోరణినే తెలంగాణను సాధించిపెట్టింది అని గట్టిగా నమ్మేవాళ్ళు చాలా మంది వున్నారు. అలాంటి కేసీఆర్ ను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందనే మాటలు వినవస్తున్నాయి, ఏకంగా సీఎం కేసీఆర్ నోటినుండే మమల్ని టార్గెట్ చేస్తున్నారనే మాటలు వస్తే ఇంకా మరో సందేహం ఏమి అవసరం లేదు.
ఇటీవల పార్లమెంటులో వ్యవసాయ, విద్యుత్ సంస్కరణల బిల్లులకు మద్దతు ఇవ్వాలని ఢిల్లీ నుంచి పెద్దఎత్తున ఒత్తిడి తెచ్చా రని, అలాగే చాలా మంది ప్రముఖులతో చెప్పించారన్నారు. అయినా రైతులు నష్టపోతారని ఆ రెండు బిల్లులకు మద్దతు ఇచ్చేం దుకు అస్సలు ఒప్పుకోలేదని కేసీఆర్ అన్నారు. దింతో తామెంతో కష్టపడి తెచ్చిన బిల్లుకు తెరాస మద్దతు ఇవ్వకపోవటంతో కన్నెర్ర చేసిన బీజేపీ పెద్దలు కేసీఆర్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. తమకి గిట్టని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఎలాంటి రాజకీయాలు చేస్తుందో అందరికి తెలుసు. కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ చేసిన కుట్రలకు ఆయా ప్రభుత్వాలే కూలిపోయాయి. రాజస్థాన్, మహారాష్ట్ర లో మాత్రం బీజేపీ పప్పులు ఉడకలేదు. ఇప్పుడు తాజాగా తెలంగాణలో కూడా బీజేపీ తన మార్క్ రాజకీయం చేయటానికి సిద్దమైనట్లు కేసీఆర్ భావిస్తున్నాడు. వాళ్ళకి లొంగి పార్టీని నాశనం చేసుకునే బదులు, పోరాడి నిలబడాలని కేసీఆర్ భావించి బీజేపీ మీద ఎదురుదాడి చేయటానికి సిద్దమయ్యాడు.
ఇందులో భాగంగా కేంద్రంలో పనికిమాలిన సర్కార్ ఉందని, వాళ్ళు చెప్పేవాటిలో 99 శాతం అబద్దాలే అంటూ కేసీఆర్ తీవ్ర విమర్శలు చేసి, మోడీ ప్రభుత్వాన్ని ఢీ కొట్టటానికి సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు ఢిల్లీకి పంపించాడు కేసీఆర్. ప్రస్తుతం దేశంలో మెల్లమెల్లగా బీజేపీ వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. మొన్నటి ఉత్తర ప్రదేశ్ సంఘటన నేపథ్యంలో బీజేపీ మీద ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ కూడా మోడీ మీద యుద్ధం ప్రకటించినట్లు తెలుస్తుంది. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ ఏమో బీజేపీ తో దోస్తీ కట్టి, ఏకంగా NDA కూటమిలో చేరి కేంద్ర పదవులు తీసుకోవాలని చూస్తుంటే, ఇటు పక్క కేసీఆర్ మాత్రం మోడీతో యుద్దానికి సిద్దమయ్యాడు..