PM Modi Birthday Wishes: మోదీ నాయకత్వంపై చంద్రబాబు, పవన్ ప్రశంసలు: ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వాన్ని, దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో పోస్టులు చేశారు.

చంద్రబాబు నాయుడు: ‘సరైన సమయంలో సరైన నాయకుడు’
సీఎం చంద్రబాబు తన సందేశంలో మోదీని “సరైన సమయంలో మన దేశానికి లభించిన సరైన నాయకుడు”గా అభివర్ణించారు. “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” నినాదంతో ఆయన చేపట్టిన సంస్కరణలు దేశవ్యాప్తంగా ఎందరో జీవితాల్లో సానుకూల మార్పు తీసుకొచ్చాయని ప్రశంసించారు. ‘వికసిత్ భారత్ @ 2047’ లక్ష్యంతో దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడానికి మోదీ చేస్తున్న కృషిని చంద్రబాబు అభినందించారు. ప్రధాని సంపూర్ణ ఆరోగ్యంతో మరెన్నో ఏళ్లు దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.

పవన్ కళ్యాణ్: ‘క్రమశిక్షణ, దార్శనికత కలిగిన నాయకుడు’
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేశారు. సామాన్య స్థాయి నుంచి ఎదిగి, అచంచలమైన క్రమశిక్షణతో దేశానికి మార్గనిర్దేశం చేస్తున్న నాయకుడిగా మోదీని ఆయన అభివర్ణించారు. మోదీ దార్శనికత కేవలం పాలనకే పరిమితం కాదని, ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ఐక్యతను పెంపొందించేలా ఉందని పవన్ కొనియాడారు.

‘ఆత్మనిర్భర్ భారత్’ కోసం మోదీ చేస్తున్న కృషి, పేదల పట్ల ఆయన చూపే కరుణ, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న సంకల్పం చిరస్మరణీయమని పవన్ పేర్కొన్నారు. అలాగే, గ్లోబల్ సౌత్ వాణిని ప్రపంచ వేదికలపై వినిపించడంలో మోదీ చూపిన చొరవతో భారత కీర్తి ప్రతిష్టలు పెరిగాయని ప్రశంసించారు. ప్రధాని మోదీకి మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Kanneboina Rajaiah About KCR Family History | Telugu Rajyam