కేంద్రంలో బీజేపీ రాజకీయం మాట ప్రాతిపదికన నడుస్తుందనే సంగతి అందరికి తెలుసు. హిందూత్వ నినాదంతో ఓట్లు పొందే బీజేపీకి ఇతర మైనార్టీ మతాలంటే ఒకింత చిన్నచూపు ఉంది. దేశం హిందువులదనే భావం వారిది. సంఘ్ పరివార్ మూలాల నుండి పుట్టుకొచ్చిన పార్టీ కాబట్టి ఆ పార్టీ నాయకుల ఉద్దేశ్యాలు, అభిప్రాయలు, ఆలోచనలు అలానే ఉంటాయి. దురదృష్టమో, ప్రజల అమాయకత్వమే తెలీదు కానీ వారి విధానాలు చెల్లుబాటవుతున్నాయి కూడ. వాటినే ఆంధ్రాలో కూడ అనుసరించాలని అనుకుంటున్నారు. ఆ బాధ్యతను కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు తీసుకున్నట్టు ఉన్నారు. అందుకే ప్రతి ప్రతి విషయాన్ని మతం కోణంలో అందులోనూ హిందూత్వ కోణం నుండే చూస్తున్నారు.
కొన్నిరోజుల క్రితం నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య చేసుకుంటే విపక్షాలు ఆ ముస్లిం కుటుంబానికి న్యాయం జరగాలని నినదించాయి. నిజానికి ఇక్కడ మతం పేరు అనసరమే. కానీ అన్యాయంగా మరణించింది ముస్లిం కుటుంబం అనేది కాదనలేని వాస్తవం. మైనార్టీలకు అధిక భద్రత ఉండాలనే రాజ్యాంగ నియం మేరకు మరణించింది మైనార్టీ కుటుంబమని వారికి నాయ్యం చేయాలని విపక్షాలు డిమాండ్ చేయడంలో కొంత నిజాయితీ ఉంది. కానీ బీజేపీ మాత్రం ముస్లిం కుటుంబమైతే ఇంతలా రియాక్ట్ అవుతారా అనే ధోరణిలో మాట్లాడటం మాత్రం ముమ్మాటికీ సమంజసం కాదు.
రాష్ట్రంలో ఎంతో మంది రైతులు చనిపోతుంటే స్పందించని ప్రభుత్వం, విపక్షాలు ఒక ముస్లిం కుటుంబం చనిపోతే పోలీసులను అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు వీర్రాజుగారు. ఇక్కడ మరణించిన అబ్దుల్ సలాం కుటుంబం సెల్ఫీ వీడియోలో పోలీసుల వేధింపుల కారణంగానే చనిపోతున్నట్టు తెలిపింది. కాబట్టి ఇది వ్యక్తులకు సంబంధించిన వివాదం. అందుకే భాద్యులుగా ఉన్న ఇద్దరు పోలీసులను అరెస్ట్ చేశారు. కానీ వీర్రాజుగారు చెబుతున్న రైతుల ఆత్మహత్యల అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించింది. అక్కడ వ్యక్తులు లేరు వ్యవస్థలు ఉన్నాయి. రైతుల్లో ఎవరైనా పలానా రాజకీయ నాయకుడి వేధింపులు, పాలనా అధికారి అవినీతికి తట్టుకోలేక మరణిస్తే ఆ వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి.
అబ్దుల్ సలాం కుటుంబం విషయంలో జరిగింది కూడ అదే. కొందరు పోలీసుల వేధింపులే వారి మరణాలకు కారణం కాబట్టి అరెస్ట్ చేశారు. దీన్ని పట్టుకుని ముస్లిం అయితే ఇంతలా స్పందిస్తారా, పోలీసులను అరెస్ట్ చేస్తారా అంటూ విపరీత రీతిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాట్లాడటం చూస్తే ఆ పార్టీలో మతతత్వం తప్ప మానవత్వం లేదేమో అనే అనుమానం కలుగుతోంది.