ఇటీవలే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కవిత గెలుపొంది ఎమ్మెల్సీ అయ్యారు. ఈ ఉపఎన్నికలో మొత్తం 824 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో కవిత బంపర్ మెజారిటీతో గెలుపొందారు. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఓటమి చెందాక కవిత చాలా డీలా పడిపోయారు. కేసీఆర్ సైతం ఆమెను త్వరగా పదవిలో చూడాలని తహతహలాడారు. ఆ తరుణంలోనే ఉప ఎన్నిక అవకాశం రావడంతో ఆమెను గెలిపించుకున్నారు.
ఇదిలా ఉంటే కవిత ఎమ్మెల్సీగా గెలిచాక తర్వాత ఏమిటి అనే చర్చ మొదలైంది. కవిత ఎంపీగా పనిచేసి ఉన్నారు కాబట్టి ఆమెకు మంత్రి పదవి ఖాయమని కొందరు అంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు కాబోయే మంత్రి అంటూ ఆమెకు అభినందనలు తెలిపారు. మంత్రివర్గంలో ఉండాల్సిన 18 మంది ఉన్నారు. ఇప్పుడు కొత్తగా కవితను చోటు ఇవ్వలేరు. కానీ కేసీఆర్ తలుచుకుంటే ఎవరో ఒకరు మంత్రి పదవి నుండి తప్పుకుని కవితకు మార్గం సుగమం చేయొచ్చు. మరి కవితకు కోసం మంత్రి పదవిని త్యాగం చేయబోయే ఆ హీరో ఎవరనేది తేలాలి.
రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాటల మేరకు త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుందని తెలుస్తోంది. ఇందులో జరగబోయే మార్పుల్లోనే కవితకు మంత్రి పదవి దక్కడం ఖాయం అంటున్నారు. ఒకవేళ కవితకు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోటాలో మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి మీదే ఎఫెక్ట్ కనబడుతుంది. తాజాగా ఒక మంత్రి మీద పెద్ద వివాదమే రేగింది. ఇది సినీ గ్లామర్ వివాదం. ఆయన్ను మంత్రివర్గం నుండి తొలగించే అవకాశాలు లేకపోలేదు. ఇంకొందరైతే దుబ్బాక ఓటమిని చూపి హరీష్ రావునే పక్కపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు.