ఈ వ్యూహాలతో టీడీపీ బలోపేతమవుతుందా.?

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో మొత్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేయగలుగుతుందా.? ఆ స్థాయిలో ఆ పార్టీకి అన్ని చోట్లా అభ్యర్థులు వున్నారా.? లేదా.? ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా బలహీనపడింది.

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అయితే, ఈసారి టీడీపీ తిరిగి పుంజుకోలేనంత స్థాయికి పతనమైపోయింది. దానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేసిన తప్పిదాలే ప్రధాన కారణం. చంద్రబాబు వ్యూహాలు దెబ్బ తినడం, చినబాబు నారా లోకేష్ అతి.. వెరసి పార్టీని భ్రష్టు పట్టించాయి. టీడీపీలో ఎవర్ని సమర్థించాలో, ఎవర్ని బయటకు పంపాలో తెలియని దుస్థితి పార్టీ అధినాయకత్వానికి వచ్చి పడింది.

అధికార వైసీపీ మీద విమర్శలు చేస్తే, రాజకీయంగా బలపడతామనే భ్రమల్లో చాలామంది టీడీపీ నేతలున్నారు. నిజానికి, అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఇదే తంతు. అధికార వైసీపీ ఇందుకు మినహాయింపేమీ కాదు. విపక్షాలపై మాటల దాడి చేస్తే, తమ బలం మరింత పెరుగుతుందన్న భ్రమల్లో వైసీపీ వుంది. అయితే, వైసీపీ చేతిలో అధికారం వున్న దరిమిలా, వైసీపీ ఏం చేసినా చెల్లిపోతోంది.

విపక్షాలేవీ తమకు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో లేవన్న భావనతో వైసీపీలో విర్రవీగడం అనే వ్యవహారం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకు వైసీపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నది వేరే చర్చ. కానీ, ప్రధాన ప్రతిపక్షం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో అచేతనావస్థలోకి వెళ్ళిపోవడమే అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. అంటూ రాజకీయాల్లో తన అనుభవం గురించి చంద్రబాబు పదే పదే చెప్పుకుంటున్నారు తప్ప, గ్రామ స్థాయిలో పార్టీ పునరుత్తేజం కోసం చంద్రబాబు ప్రయత్నించడంలేదు. జనసేనతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాడుతున్న వైనం, జనసేనను బలోపోతం చేస్తోంది. ‘టీడీపీలో ఎందుకు.? వైసీపీలోకి లేదా జనసేనలోకి వెళ్ళిపోతే సరి.. బీజేపీ ఎలాగూ జాతీయ స్థాయిలో బలంగా వుంది గనుక, ఆ పార్టీలోకైనా దూకేద్దాం..’ అన్న భావనతో తెలుగు తమ్ముళ్ళు వున్నారంటే, టీడీపీ ప్రస్తుత పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.