వైసీపీలో సంక్షోభం: ఈ ‘పచ్చ’ వంటకం కాస్త ఆలస్యమయ్యిందేలా.!

Is Internal Strife in YCP

Is Internal Strife in YCP

రాజకీయ పార్టీ అన్నాక అంతర్గత కలహాలు సర్వసాధారణం. అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా.. ఏ రాజకీయ పార్టీ కూడా ఇందుకు అతీతం కాదు. నేషనల్ మీడియాలో కాస్త ముందుగా కథనాలు షురూ అయ్యాయి.. టీడీపీ అనుకూల మీడియాలో కాస్త ఆలస్యంగా మొదలయ్యాయి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభమంటూ. ‘రచ్చబండ’ సూపర్ స్టార్, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీలో సంక్షోభం నిజమేనంటూ, టీడీపీ అనుకూల మీడియాకి కావాల్సినంత మసాలా అందిస్తున్నారు. నిజమేనా.? వైసీపీలో సంక్షోభానికి అవకాశాలున్నాయా.? అంటే, ఎందుకు వుండవు.. రాజకీయాల్లో ఎప్పుడూ ఎత్తులకు పైయెత్తులనే పక్రియ కొనసాగుతూనే వుంటుంది. ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశ ఎవరికి వుండదు.? కానీ, అధినేత వైఎస్ జగన్‌ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ ఎదిరించే ప్రసక్తి లేదు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ.. ఇలా చాలామంది సీనియర్ నేతలు వైసీపీలో వున్నా, వారెవరూ ఇప్పటికిప్పుడు వైఎస్ జగన్‌ని దించేయాలనుకోరు.. అలాగని ముఖ్యమంత్రి పదవి కోసం లోలోపల ఆశ పడకుండా వుండరన్నది సాధారణంగా వినిపించే అభిప్రాయం. ‘సొంత రాజకీయ బలం’ ఎంత.? అన్న విషయమై సీనియర్ పొలిటీషియన్లకు ఓ అవగాహన ఖచ్చితంగా వుంటుంది. బొత్స సత్యనారాయణ విషయానికొస్తే, గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఓ దశలో సీఎం అభ్యర్థిగా ఆయన పేరు వినిపించింది. కానీ, అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియారిటీ తక్కువేమీ కాదు. కానీ, ఈ సీనియారిటీ అనేది జగన్‌ని ఎదిరించే స్థాయిలో లేదు, జగన్‌కి సహకరించే స్థాయిలోనే వుందన్నది నిర్వివాదాంశం. వైసీపీలో చిచ్చపెట్టేందుకు ఈ ఇద్దరి చుట్టూ టీడీపీ అనుకూల మీడియా కథనాల్ని వండి వడ్డిస్తోంటే, వైసీపీలో కొందరు సైతం వాటిని ఎంటర్‌టైన్ చేస్తున్న పరిస్థితి గ్రౌండ్ లెవల్‌లో కనిపిస్తున్న మాట వాస్తవం.