మొదట్లో మెగాస్టార్ చిరంజీవిని దువ్వేందుకు ప్రయత్నించింది భారతీయ జనతా పార్టీ. అంతకన్నా ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌నీ తమవైపుకు తిప్పుకుంది. సీనియర్ నటుడు, నిర్మాత మోహన్‌బాబు సహా చాలామంది సినీ ప్రముఖులు బీజేపీతో ఒకింత సన్నిహితంగానే వుంటూ వస్తున్నారు.
2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరినా, సినీ నటుడు మోహన్‌బాబు తాను బీజేపీ మనిషినని ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, బీజేపీ జాతీయ నాయకుల హైద్రాబాద్ పర్యటనలో ఎక్కడా మంచు కుటుంబ సభ్యుల ప్రస్తావన రావడంలేదు. విష్ణు కావొచ్చు, మనోజ్ కావొచ్చు, లక్ష్మి కావొచ్చు.. మోహన్‌బాబు కావొచ్చు.. ఎవర్నీ బీజేపీ జాతీయ నాయకులు పట్టించుకోవడంలేదు.
యంగ్ టైగర్ ఎన్టీయార్, నితిన్.. ఇలా పలువురు సినీ హీరోలతో బీజేపీ జాతీయ నేతలు.. టచ్‌లోకి వెళ్ళడం వెనుక పెద్ద రాజకీయమే వుందన్నది సుస్పష్టం. మరికొందరు సినీ ప్రముఖులతోనూ బీజేపీ జాతీయ నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు. జీవిత బీజేపీలో చేరారు, రాజశేఖర్ కూడా బీజేపీ తరఫునే పని చేస్తారు. జయసుధ కూడా బీజేపీలో చేరబోతున్నారు.
మరి, తెలంగాణ రాష్ట్ర సమితిని కాదని ఎంతవరకు సినీ పరిశ్రమ బీజేపీతో నడుస్తుంది.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. బీజేపీ కేంద్రంలో అధికారంలో వుంది గనుక, బీజేపీ జాతీయ నాయకులు ఏ కారణంతో తమను కలిసేందుకు ప్రయత్నిస్తున్నా సినీ ప్రముఖులు ‘నో’ చెప్పే అవకాశం వుండదు.
ఏమో, రేప్పొద్దున్న అల్లు అర్జున్ కూడా బీజేపీ జాతీయ నాయకులతో భేటీ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు. ఆ హీరో ఈ హీరో అన్న తేడాల్లేవు.. సినీ గ్లామర్ మీద బీజేపీ అయితే స్పెషల్ ఫోకస్ పెట్టింది. మరి, ఆ గ్లామర్ బీజేపీకి ఓట్లను తెచ్చిపెడుతుందా.? అంటే, అదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే.
మరోపక్క, బీజేపీ ఆయా సినీ ప్రముఖులతో ఏం మాట్లాడుతోంది.? అన్నదానిపై గులాబీ ఇంటెలిజెన్స్ ఆరా తీయడం ఈపాటికే షురూ చేసి వుండాలి.