రాజకీయాల్లోనూ అలీ ‘కమెడియన్’ అయిపోయారా.?

ఒకప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో వున్నారు. స్నేహితుడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో ఆయన చేరతాడన్న ప్రచారమూ జరిగింది. అనూహ్యంగా ఆయన వైసీపీలో చేరారు. ఎన్నికల బరిలో దిగుతారనుకున్నారుగానీ, టిక్కెట్ సంపాదించలేకపోయారు. ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి అయినా దక్కుతుందంటే, ఆ ఎమ్మెల్సీ పదవీ లేదు.. మంత్రి పదవీ లేదు.

పరిచయం అక్కర్లేని పేరది. ఆయనే కమెడియన్ అలీ. సినీ నటుడిగా ఆయనది సుదీర్ఘ ప్రస్తానం. రాజకీయ తెరపై మాత్రం రాణించలేకపోతున్నారు. గతంలో టీడీపీకి, ఆ తర్వాత వైసీపీకీ బాగా ఉపయోగపడ్డాడు అలీ. కేవలం ఆయా పార్టీలో అలీ కమెడియన్ లేదా అతిథి పాత్ర.. ప్రాధాన్యత లేని పాత్ర.. అన్నట్టు తయారైంది వ్యవహారం.

‘వారం రోజుల్లో మంచి వార్త అధికారికంగా రాబోతోంది..’ అని కొన్ని నెలల క్రితం అలీ చెప్పిన విషయం విదితమే. వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు రావడం, ఈ క్రమంలో అలీ ఉత్సాహంగా వెళ్ళి, అంతకన్నా ఉత్సాహంగా బయటకొచ్చి మీడియాతో మాట్లాడటం విన్నాం, చూశాం.

కానీ, మంత్రి వర్గ విస్తరణలోనూ చోటు దక్కలేదు.. రాజ్యసభ సభ్యుడిగానూ అవకాశం రాలేదు. పార్టీ పరమైన పదవులూ రాలేదు. మరిప్పుడు అలీ పరిస్థితేంటి.? ఇదే విషయమై అలీని ప్రశ్నిస్తే, ‘నాకు పదవుల విషయమై వైఎస్ జగన్ ఎలాంటి హామీ ఇవ్వలేదు.. నేనెలాంటి పదవులూ అడగలేదు..’ అని చెప్పారు.

మరి, గతంలో పదవులు వస్తాయ్.. అని ఎందుకు అన్నారు.? అన్న ప్రశ్నకైతే అలీ నుంచి సమాధానమే లేకుండా పోతోంది. మైనార్టీ కోటాలో అలీని రాజ్యసభకు వైసీపీ పంపి వుంటే, ఆ పార్టీకే మైలేజ్ పెరిగేది.