ఐపీఎస్ ఏబీవీ మరోమారు సస్పెండ్.! వైసీపీ సర్కారు ఏం సంకేతమిస్తోంది.?

వ్యవస్థల కంటే వ్యక్తి గొప్పవాడా.? ప్రభుత్వం కంటే ఓ అధికారి గొప్పవాడా.? ఈ చర్చ ఇప్పుడు ప్రజల్లో జరుగుతోంది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అస్సలేమాత్రం మంచిది కాదు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మరోమారు ఏపీ సర్కారు సస్పెన్షన్ వేటు వేసింది. కొద్ది రోజుల క్రితమే ఆయనకి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఇంతలోనే ఆయనపై ఇంకోసారి సస్పెన్షన్ వేటు పడింది.

గతంలో, అంటే వైసీపీ అధికారంలోకి వస్తూనే ఏబీవీపై తొలిసారిగా వేటు వేయడం జరిగింది. దాన్ని ఆయన న్యాయస్థానంలో సవాల్ చేశారు, ఊరట పొందారు. సుప్రీంకోర్టులో కూడా వైసీపీ సర్కారు వాదన నెగ్గలేదు. ప్రభుత్వంపై ఓ ఐపీఎస్ అధికారి పై చేయి సాధించడమంటే అది చిన్న విషయం కాదు. ఇక్కడ ప్రభుత్వం కంటే ఓ ఐపీఎస్ అధికారి గొప్ప.. అనే భావన జనంలోకి వెళ్ళిపోయింది.

సరే, న్యాయస్థానాలు.. తీర్పులు.. అది వేరే వ్యవహారం. కానీ, ప్రభుత్వం ఇంకోసారి ఏబీవీని సస్పెండ్ చేయడం ద్వారా ఏం సంకేతాలు పంపుతోంది.? అన్నదే కీలకం. సభ్య సమాజంలోకి తప్పుడు సంకేతాలు అయితే వెళ్ళాయి. ఏబీవీ మీద ప్రభుత్వం అభియోగాలు మోపుతోంది. అదే ప్రభుత్వం పోస్టింగ్ కూడా ఇచ్చింది. ఇక్కడే ప్రభుత్వం తాలూకు డొల్లతనం బయటపడింది.

ఏబీవీ ఇప్పుడేం చేస్తారు.? ఇంకేం చేస్తారు.. మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తారు. కొన్నాళ్ళపాటు కేసు ‘సాగు’తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏబీవీకి అనుకూలంగా తీర్పు వస్తే.? ప్రభుత్వం మళ్ళీ ఓడిపోయినట్టే. కానీ, ఈ కేసుల వాదన కోసం ప్రభుత్వం చేసే ఖర్చు మాటేమిటి.? అది ప్రజాధనం.. దానికి జవాబుదారీతనం ఎవరు వహిస్తారు.?