ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 యూఏఈలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఇండియాలో జరగాల్సిన ఆ టోర్నమెంట్, కరోనా కారణంగా యూఏఈకి తరలి వెళ్ళింది. అక్కడ బయో బబుల్ బాగానే పనిచేసింది. కొన్నాళ్ళ క్రితం ఇంగ్లాండ్ జట్టు భారతదేశంలో పర్యటించి వన్డేలు, టీ20, టెస్ట్ క్రికెట్ ఆడినాగానీ, కరోనా సమస్య రాలేదు. ఇక్కడా బయో బబుల్ అత్యద్భుతంగా పనిచేసింది. కానీ, 2021 ఐపీఎల్ వచ్చేసరికి సీన్ మారిపోయింది. మొదట్లో పోటీలు బాగానే జరిగాయి. ఆటగాళ్ళెవరికీ కరోనా సమస్యలు రాలేదు. కానీ, దేశంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసుల ఎఫెక్ట్ ఐపీఎల్ మీద కూడా పడింది. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ రద్దు చేయడమే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఐపీఎల్ ఆపెయ్యాలంటూ కోర్టుల్ని కూడా ఆశ్రయించారు. ఎప్పుడైతే ఆటగాళ్ళలో కొందరికి, సిబ్బందిలో కొందరికి కరోనా సోకిందో, ఐపీఎల్ నిర్వహణపై నీలి మేఘాలు అలముకున్నాయి.
కేవలం గంటల వ్యవధిలోనే, ఐపీఎల్ రద్దు ప్రకటన వచ్చేసింది. ఇంతకీ, బయో బబుల్ ఇక్కడెందుకు ఫెయిలయ్యింది.? ఆటగాళ్ళకైనా, సిబ్బందికైనా కరోనా ఎలా సోకింది.? ఇప్పుడీ ప్రశ్నలు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. అత్యంత కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, బయో బబుల్.. ఇవన్నీ వున్నా, కరోనా వైరస్ సోకిందంటే.. ఆషామాషీ వ్యవహారం కాదు. ఆటగాళ్ళ ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు. అందుకే ఐపీఎల్ రద్దయ్యింది. బయో బబుల్ నీడన ధైర్యంగా వున్న ఆటగాళ్ళకు కరోనా వైరస్, గాలి ద్వారా సంక్రమించిందా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. కరోనా రోగి వున్న ఓ మూసివున్న ప్రదేశంలో మాత్రమే గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనీ, అంతే తప్ప వైరస్ గాల్లో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం లేదనీ నిపుణులు చెబుతున్నారు. ఏమో, ఈ మహమ్మారి బయో బబుల్ బద్దలుగొట్టుకుని ఆటగాళ్ళకు ఎలాసోకిందో ప్రస్తుతానికైతే మిలియన్ డాలర్ల ప్రశ్నే.