ప్రకాశం వైసీపీలో ముదిరిన రాజకీయాలు.. వైవీ రాకతో బాలినేని గరం గరం

balineni vs yv

 ప్రకాశం జిల్లా వైసీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది. దర్శి నియోజకవర్గంలో మొదలైన ఆధిపత్య పోరు చినికి చినికి గాలి వానగా మారుతుంది. వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉన్న బూచేపల్లి.., పార్టీ ఇచ్చిన మాటను నమ్మి 2019 ఎన్నికల బరిలో దిగి విజయం సాధించి మద్దిశెట్టి ఇరువురూ ప్రతిష్టకు పోయి పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. రెండు వర్గాలు బాహాబాహాకి తలపడుతూ ఫ్యాను పరువును నడివీధిలో నిలబెడుతున్నాయి.

balineni vs yv

 

బూచేపల్లి వర్సెస్ మద్దిశెట్టి

 ముండ్లమూరులో బూచేపల్లి, మద్దిశెట్టి వర్గాల మధ్య జరిగిన గొడవల నేపథ్యంలో ఇరువర్గాలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదులు చేశాయి. కానీ పోలీసులు ఎమ్మెల్యే ఫోన్ తో మద్దిశెట్టి వర్గం ఇచ్చిన ఫిర్యాదును రిజిస్టర్ చేసి.., బూచేపల్లి వర్గం ఫిర్యాదును పక్కన పెట్టారు. దీనిపై బూచేపల్లి వర్గం డిసెంబర్ 6న అద్దంకి పర్యటనకోసం జిల్లాకు వచ్చిన వైవీ సుబ్బారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. మరుక్షణం పోలీసులు బూచేపల్లి వర్గం వారి ఫిర్యాదుపై కూడా కేసు రిజిస్టర్ చేశారు. ఇంతటితో ఆగని రెండు వర్గాలు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిని కలిసి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఎమ్మెల్యే మాటే నియోజకవర్గంలో ఫైనల్ అని ఇంతకు ముందు చెప్పామని.. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని ఇద్దరికీ బాలినేని మరోసారి స్పష్టం చేశారు.

 అదే సమయంలో ప్రకాశం జిల్లా రాజకీయాలకు దూరంగా ఉండాలని వైవీ సుబ్బారెడ్డికి గతంలోనే జగన్ చెప్పటం జరిగింది. ఆ తర్వాత వైవీని టీటీడీ చైర్మన్ గా చేసి ఒక రకంగా ప్రకాశం జిల్లాకు దూరం చేశాడు , జిల్లా పార్టీ వ్యవహారాలను బాలినేని శ్రీనివాసరెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని చూడాలని జగన్ ఆదేశాలు జారీచేశారు. వారితో పాటు అవసరం అయిన కీలక సందర్భాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగుతున్నారు.

 ఇప్పుడు వైవీ దర్శి వివాదంలో జోక్యం చేసుకోవడం.., పార్టీ కీలక నేతల మధ్య మళ్లీ వివాదాలు తలెత్తేలా చేసేలా ఉంది. వైవీ జోక్యంపై ప్రస్తుతం బాలినేని వర్గం ఇప్పుడు ఏమి మాట్లాడకుండా మిన్నకున్నా.. దర్శి వివాదం జగన్ కి వద్దకు చేరితే అన్ని విషయాలూ తన దృష్టికి వస్తాయి. వైవీ వర్సెస్ బాలినేని మధ్యనున్న వివాదాలను ఇటు బూచేపల్లి, అటు మద్దిశెట్టి వర్గాలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తే అధిష్టానం నుండి అక్షింతలు పడటం ఖాయం.