శ్రీలంక-ఇండియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం జరిగిన తోలి మ్యాచ్లో ఆతిధ్య జట్టుపై భారత జట్టు అలవోకగా గెలుపునందుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులు చేసి భారత్ కు సవాల్ విసిరింది. అయితే మన కుర్రాళ్లు మాత్రం ఆడుతూ పాడుతూ అన్నట్లుగా 36.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించారు. శిఖర్ ధావన్ కెప్టెన్ గా డెబ్యూ మ్యాచ్లోనే విజయం అందుకున్నాడు. ఈ గెలుపుతో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ నెల 20న రెండవ మ్యాచ్ జరగనుంది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక… చమిక కరుణరత్నె (43 నాటౌట్: 35 బంతుల్లో) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. వాస్తవానికి 48 ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక 230/8తో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ… ఇన్నింగ్స్ 49వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో దుష్మంత్ చమీరా (13: 7 బంతుల్లో) ఒక ఫోర్, సిక్స్ బాది 13 పరుగులు రాబట్టగా… ఆఖరి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కరుణరత్నె ఒక ఫోర్, రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లతో మొత్తం 19 పరుగులు రాబట్టాడు. దాంతో శ్రీలంక గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. మన బౌలర్లలో కుల్‌దీప్, చాహల్, చాహర్ లు తలో రెండు వికెట్స్ తీయగా, పాండ్య బ్రదర్స్ చెరో వికెట్ సాధించారు.
ఇక లక్ష్య ఛేదనకు ఓపెనర్లుగా దిగిన పృధ్విషా, శిఖర్ ధావన్ లు శ్రీలంక బౌలర్లను ఆటాడుకున్నారు. పృధ్విషా ధాటిగా ఆడగా (24 బంతుల్లో 43; 9 ఫోర్లు), శిఖర్ ధావన్ మాత్రం బాధ్యతాయుత ఇన్నింగ్స్ (86 నాటౌట్: 95 బంతుల్లో) ఆడి భారత జట్టు గెలుపులో ప్రముఖ పాత్ర పోషించాడు. ఓపెనర్ పృధ్విషా ఔట్ అవగా క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ డెబ్యూ మ్యాచ్లో (59: 42 బంతుల్లో) అదరగొట్టేశాడు. ఆ తర్వాత మనీష్ పాండే 26 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులు చేసి శిఖర్ ధావన్ కు తమవంతు సాయం అందించారు. శ్రీలంక బౌలర్లలో ధనంజయ డి సిల్వా కు రెండు వికెట్స్ ,లక్షన్ సందకన్ కు ఒక వికెట్ లభించింది.