మామూలుగా అయితే, టీమిండియా – పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ ఎప్పుడు ఎక్కడ జరిగినా నరాలు తెగే ఉత్కంఠ వుంటుంది. అదే వరల్డ్ కప్ పోటీల్లో అయితే అది ఇంకా ఎక్కువగా వుంటుంది. కానీ, ఈసారి పరిస్థితి అందుకు భిన్నం. టీవీ సెట్ల ముందు అతుక్కుపోయిన సగటు భారత క్రికెట్ అభిమాని, తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు.
ఎప్పుడైతే రోహిత్ శర్మ గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడో.. అప్పుడే మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ చాలామందికి పోయింది. ఎవరన్నా ఆదుకుంటారేమో.. అంటూ ఒక్కో ఆటగాడి గురించీ ఎదురుచూశారు. కోహ్లీ నిలబ్డాడు.. కానీ, ఏం లాభం.? జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
వాస్తవానికి 151 పరుగులు చేసిన టీమిండియా, ఓ మోస్తరు టార్గెట్‌నే పాకిస్తాన్ జట్టు ముందుంచింది. కానీ, బౌలర్లు దెబ్బ కొట్టేశారు. అస్సలేమాత్రం ప్రభావం చూపలేకపోయారు. పాకిస్తాన్ ఓపెనర్లు మొత్తం పని చక్కబెట్టేశారు ఎలాంటి బెరుకూ లేకుండా. ఫలితం.. ఐసీసీ వరల్డ్ కప్ పోటీల్లో తొలిసారి టీమిండియా, పాకిస్తాన్ జట్టు చేతిలో పరాజయం పాలైంది.
ఆటలో గెలుపోటములు సహజమే అయినా, పాకిస్తాన్ జట్టు చేతిలో టీమిండియా ఓటమి అత్యంత బాధాకరం. దీన్ని సగటు భారతీయుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. కనీసం గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయినా.. అది వేరే లెక్క. మరీ నాసిరకమైన ఆటతీరుని టీమిండియా ప్రదర్శించిందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
‘పాకిస్తాన్‌లో ఈసారి ఎన్ని టీవీలు పగులుతాయో..’ అని సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేసిన ఇండియన్ నెటిజన్లు.. ఇప్పుడు, పాకిస్తానీ నెటిజన్లు విసురుతున్న సెటైర్లకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
అయితే, ఇలాంటి టోర్నీల్లో తొలి మ్యాచ్‌ని చేజార్చుకోవడం కోహ్లీ సేనకు అలవాటుగా మారిపోయింది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలు కాబోతోంది. దురదృష్టం తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో అయ్యింది.. అంతే తేడా.