India: ‘ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అయ్యాయి’ అని ఓ సామెత. ప్రస్తుతం భారత్ పరిస్థితి వాస్తవంలో కాస్త అటూఇటుగా ఇలానే ఉందని చెప్పాలి. దేశంలో కరోనా సెకండ్ మ్యూటేషన్ తీవ్రత ఒకెత్తు.. ఆక్సిజన్ కొరత మరొక ఎత్తు. మొదటి వేవ్ లో కరోనా నియంత్రణపై దృష్టి సారించి విజయం సాధించింది ప్రభుత్వం. ప్రస్తుతం సెకండ్ వేవ్ ను కంట్రోల్ చేయడమే కాకుండా ఆక్సిజన్ నిల్వలను దేశం మొత్తానికి అందించడం మరొక సవాల్. ఒకరకంగా రెండు పడవలపై ప్రయాణంలా ఉంది కేంద్రం పరిస్థితి. రాష్ట్రాలు తాము చేయాల్సింది చేస్తున్నా.. కేంద్రంతోపాటు మరో రాష్ట్రాన్ని సాయం అడిగే పరిస్థితులు వచ్చేశాయి.
వ్యాక్సిన్ వచ్చిందనే ధైర్యంతో ఉన్న కేంద్రానికి.. సెకండ్ మ్యూటేషన్ చాలా పెద్ద షాక్ ఇచ్చింది. ఎన్నో దేశాలకు వ్యాక్సిన్ సప్లై చేసిన భారత్ మొదట మన సంగతి చూడలేదు. వయసు ఆధారంగా ఇవ్వాలని ఆలోచించి.. ఫ్రంట్ లైన్ వర్కర్స్, తర్వాత 60 ఏళ్లు.. ఆతర్వాత 45 పైబడిన వారి వరకూ వచ్చింది. కానీ.. ఊహించని విపత్తు పెను ఉప్పెనలా వచ్చేసరికి వెంటనే 18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ ప్రకటించింది. కానీ.. ఈలోపే రోజుకు నాలుగంకెల్లోకి పడిపోయిన కరోనా కేసులు ఏకంగా వారం తేడాలో రోజుకి 3.50 లక్షలకు చేరిపోయాయి. దీంతో ఆక్సిజన్ కొరత, మరణాలు.. ఇలా అల్లాడిపోతోంది భారతదేశం.
దీంతో ఒకప్పుడు దేశాలకు సాయం చేసి ఇప్పుడు సాయం అర్ధించే పరిస్థితికి వచ్చేశాం. సింగపూర్ నుంచి ఆక్సిజన్ నిల్వలు వచ్చాయి. భారత్ కు ఎలా సాయం చేయాలా అని బ్రిటన్ చూస్తోంది. అమెరికా సాయం చేస్తామంటోంది కానీ.. వ్యాక్సిన్ కు కావల్సిన ముడిసరుకును మాత్రం ఇవ్వడం లేదు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, చైనా, పాకిస్థాన్.. ఇలా ప్రతి దేశం భారత్ వైపు జాలిగా చూస్తూ సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఎప్పుడు ఎవరినీ నిందించే పని లేదు. మన జాగ్రత్తల్లో మనం ఉండటం.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడం, కరోనా నిబంధనలు విధిగా పాటిస్తూ.. ఈ విపత్తు నుంచి గట్టెక్కడమే..!