భారతీయులందరికీ ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. భారతీయుల సగటు జీవిత కాలం పెరిగింది. గత మూడు దశాబ్దాల్లో భారతీయుల సగటు జీవిత కాలం భారీగా పెరిగినట్టు ఓ సర్వేలో వెల్లడైంది.
1990 లో భారతీయుల సగటు ఆయుష్షు 59.6 సంవత్సరాలు ఉండేది. అంటే 60 ఏళ్లకు రాగానే చాలామంది చనిపోయేవారు. కానీ.. గడిచిన మూడు దశాబ్దాల్లో ఆయుష్షు సగటు పెరిగింది. 2019 నాటికి సగటు ఆయుర్దాయం 70.8 ఏళ్లకు పెరిగింది.
అయితే.. ఇది అన్ని రాష్ట్రాలకు వర్తించదు. రాష్ట్రాల వారీగా తీసుకుంటే ఆయుర్దాయంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో సగటు జీవిత కాలం అత్యధికంగా ఉండగా… ఉత్తరప్రదేశ్ లో అత్యల్పంగా ఉన్నట్టు సర్వేలో తేలింది.
కేరళలో ఆయుర్దాయం 77.3 సంవత్సరాలు కాగా… ఉత్తరప్రదేశ్ లో 66.9 సంవత్సరాలుగా ఉంది. 30 ఏళ్లలో ఇండియన్స్ సగటు ఆయుష్షు ఏకంగా 10 సంవత్సరాలు పెరిగింది.
బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మాత్రం ఇంకా పోషకాహార లోపాలు, ఇతర సమస్యలతో ఆయుర్దాయం తగ్గినట్టు సర్వే వెల్లడించింది.