ఆర్టీసీని ముంచేస్తూ ప్రైవేట్ వాహనదారులను ఉద్దరిస్తున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

jagan kcr telugu rajyam

లాక్ డౌన్ లో ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు తిరగకపోవడం వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికి తెలిసిందే. కానీ అన్ లాక్ ప్రారంభమై అంతరాష్ట్ర ప్రయాణాలకు అనుమతులు ఉన్నా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య మాత్రం ప్రభుత్వ బస్సులు తిరగడం లేదు. ప్రైవేటు బస్సులు మాత్రం పొలోమని తిరిగేస్తున్నాయి. ప్రయాణీకుల్ని దోచేస్తున్నాయి. ప్రైవేటు బస్సులే కాదు, కార్లు తదితర చిన్న వాహనాలు కూడా ప్రయాణీకుల్ని అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటూ తిప్పేస్తూ పండగ చేసుకుంటున్నాయి.

అసలు రెండు రాష్ట్రల మధ్య ఈ ప్రభుత్వ బస్సులకు సంబంధించి ఎలాంటి చర్చలు జరుగుతున్నాయో ఎవ్వరికీ తెలియడం లేదు. గ్రేటర్‌ హైద్రాబాద్‌ వరదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ సాయం కోరింది. ఆంధ్రప్రదేశ్‌ కొన్ని బోట్లను తెలంగాణకు పంపించింది. వరదల విషయంలో ఉన్న సఖ్యత బస్సుల విషయంలో ఎందుకు ఉండటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా ఎంతో స్నేహంగా ఉండే జగన్, కేసీఆర్ ఈ ఆర్టీసీ బస్సుల వ్యవహారంలో ఎందుకు ఇంతలా మొండికి వేస్తున్నారో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.

ప్రైవేట్ బస్సులను నియంత్రించి ఆర్టీసీని ఉద్దరిస్తామని గతంలో తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు జరుగుతున్నది దానికి పూర్తి భిన్నంగా ఉంది. దసరా సీజన్‌.. రెండు రాష్ట్రాలకూ ఎంతో ప్రత్యేకం. సంక్రాంతి కంటే కూడా పెద్ద సీజన్‌ ఇది. ఈ సీజన్‌లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు ప్రభుత్వాలు ప్రభుత్వ వాహనాలను ఆపేసి ప్రైవేట్ వాహనదారులు ఉద్దరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ప్రభుత్వ బస్సులు ఎప్పుడు తిరుగుతాయో వేచి చూడాలి.