Accident: మదనపల్లెలో విషాదం.. పెళ్లి తోరణాలు వాడక ముందే వధువు తండ్రి మృతి..!

Accident:ఈ రోజుల్లో వాహనాన్ని నడిపే వారి నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలను అరికట్టటానికి పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న ప్రతి రోజూ ఎంతోమంది రోడ్డు ప్రమాదాలలోప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఇటువంటి విషాదకర సంఘటన చోటు చేసుకుంది.కూతురు పెళ్లి చేశానన్న ఆనందం తీరకముందే రోడ్డు ప్రమాదంలో వధువు తండ్రి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

వివరాలలోకి వెళితే..చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం వెలిగల్లు గ్రామానికి చెందిన చలపతి, మల్లమ్మ దంపతులు తమ కూతురి వివాహం జరిపించి, అనంతరం వధూవరులు ఇద్దరినీ అత్తగారింటికి సాగనంపారు. ఈ క్రమంలో చలపతి దంపతులు ద్విచక్ర వాహనంపై కూతురి ఇంటికి బయలుదేరారు. దంపతులిద్దరూ ద్విచక్రవాహనంపై కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని రామక్క చెరువు కట్టపైకి రాగానే.. ఎదురుగా వస్తున్న ఆటో వీరు ప్రయాణిస్తున్న బైక్ ను ఢీ కొట్టింది. అక్కడి స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఉన్న ఆంగళ్లుకు చెందిన నాగార్జున తీవ్రంగా గాయపడ్డారు. చలపతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు తిరుపతికి తీసుకెళ్ళమని సిఫార్సు చేశారు. ఈ క్రమంలో చలపతిని తిరుపతికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. కుమార్తె పెళ్లి జరిగిన వెంటనే తండ్రి మరణించటంతో పెళ్లి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.