AP To Add New Districts: ఏపీలో కొత్త జిల్లాల జాతర.. 32కు పెరగనున్న సంఖ్య!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల స్వరూపం మరోసారి మారనుంది. రాష్ట్రంలో కొత్తగా మరో 6 జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల సంఖ్య 32కు చేరనుంది. ఈ మేరకు జిల్లాల పునర్విభజన, సరిహద్దుల మార్పుపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.

ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారు. ఈ నెల 13న సచివాలయంలో ఈ కమిటీ తొలిసారిగా సమావేశం కానుంది. మంత్రులు నారాయణ, అనిత, నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌ యాదవ్‌, నిమ్మల రామానాయుడు తదితరులు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ.. ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, కొత్తగా పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లె, రాజంపేట జిల్లాలుగా ఏర్పడే అవకాశం ఉంది. అయితే, ఈ జాబితాలో స్వల్ప మార్పులు చేర్పులు ఉండవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా, రాజధాని అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన బలంగా వినిపిస్తోంది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా, లోపభూయిష్టంగా జరిగిందని కూటమి ప్రభుత్వం విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు, ఈ లోపాలను సరిదిద్దేందుకే ఈ కొత్త కసరత్తు చేపట్టినట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మండలాల విలీనం, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, భౌగోళిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

మంత్రివర్గ ఉప సంఘం నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా వచ్చే నెలలో కొత్త జిల్లాలు, మండలాల సర్దుబాటుపై ప్రభుత్వం అధికారికంగా తుది ప్రకటన విడుదల చేయనుంది.

Mass Jathara - Teaser Reaction And Review By Cine Critic Dasari Vignan || Raviteja, Sreeleela || TR