crime News: ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు పిల్లలకు ఎటువంటి కష్టం లేకుండా వారు అడిగినవన్నీ సమకూరుస్తున్నారు. ఈ కారణంగా పిల్లలు వయసు పెరిగినా కూడా అదే మొండి పట్టుదలతో ఉంటున్నారు.కొంతమంది యువత చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.ప్రతి చిన్న విషయాలను భూతద్దంలో చూసి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. తెలంగాణలో 20 ఏళ్ల యువకుడు కారు కొనివ్వడం లేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే… జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, కల్లూరు గ్రామానికి చెందిన సీపెల్లి అంజయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. అంజయ్య గీత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెద్ద కుమారుడు ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్ళగా ..చిన్న కుమారుడు సీపెల్లి భానుప్రకాష్ తల్లిదండ్రులతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. భాను ప్రకాష్ ఇంటర్ పూర్తవగానే ఇంటి వద్దనే ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా భానుప్రకాష్ కారు కొనాలంటే తరుచు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే వాడు. ఇటీవల కొత్త ఇల్లు నిర్మించుకోవటం వల్ల ఆర్థిక పరిస్థితులు సరిగా లేదు లేనందున కార్ కొనటానికి వీలు కాదని అంజయ్య చెప్పాడు.
తండ్రి అలా కారు కొనివ్వలేనని చెప్పటంతో మనస్తాపానికి గురైన భాను ప్రకాష్ శనివారం సాయంత్రం ఇంటి నుండి బయటకి వెళ్లి మద్యం సేవించాడు. భాను ప్రకాష్ మద్యం మత్తులో యాసిడ్ తాగి రోడ్ మీద పడి ఉండటం తో అటుగా వెళ్తున్న వ్యక్తి గమనించి ఇంటి వద్ద దింపాడు. తాను యాసిడ్ తాగిన విషయాన్ని తండ్రికి చెప్పడంతో, వెంటనే ఆయన చికిత్స నిమిత్తం భాను ప్రకాష్ ను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం అతను మృతి చెందాడు. గతంలో కూడా సెల్ ఫోన్ కొనివ్వలేదని చెయ్యి కోసుకున్నాడు అని తండ్రి తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.