బయటకి వెళ్లే ముందు.. ఇలాంటి శకునాలు కనిపిస్తే మీ ప్రయాణం వాయిదా వేసుకోండి..!

నేటి కాలంలో రోడ్ల పరిస్థితులు, వాహనాల వేగం, ప్రమాదాల సంఖ్య చూసి బయటికి వెళ్ళే ప్రతి ఒక్కరికీ ఒక చిన్న భయం వెంటాడుతుంది. ఇంటి నుండి బయలుదేరిన మనిషి సురక్షితంగా తిరిగి వస్తాడా.. లేదా.. అన్న ఆలోచన ప్రతీ కుటుంబంలోనూ కలుగుతుంది. ఈ నేపథ్యంలో, తరతరాలుగా వస్తున్న కొన్ని శకునాల నమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయి. శాస్త్రీయ ఆధారం లేకపోయినా, అనుభవాల ఆధారంగా కొందరు వాటిని పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రయాణానికి బయలుదేరే సమయంలో కొన్ని సంఘటనలు జరిగితే వాటిని అశుభ సూచనలుగా భావించి, కొంతసేపు ఆగి, మంచి సమయం చూసుకుని వెళ్లాలని పెద్దలు చెబుతారు.

ఇంటి నుండి బయటకి అడుగుపెడుతూనే చెప్పులు లేదా బూట్లు తెగిపోతే ఆ రోజు ప్రయాణం సాఫీగా జరగదని, దారిలో ఆటంకాలు ఎదురవుతాయని నమ్మకం ఉంది. అంతేకాకుండా రోడ్డుపై చనిపోయిన జంతువు కనబడితే అది ఎదురయ్యే ఇబ్బందులకు సంకేతమని అనుకుంటారు. తుమ్ము రావడం కూడా ఒక అశుభ సూచనగానే పరిగణిస్తారు. ఆ సమయంలో బయటకు వెళ్ళకుండా, కొంతసేపు ఆగి తర్వాత బయలుదేరితే మంచిదని పెద్దలు చెబుతారు.

అలాగే, ఇంటి బయట గొడవ జరగడం, కోపం రావడం, మాటల తగాదా మొదలవ్వడం కూడా ప్రతికూల ఫలితాలకే దారితీస్తుందని విశ్వాసం ఉంది. పాలు, నీరు లేదా ఆహారం పడిపోవడం కూడా పనులు పూర్తి కాకపోవడానికి సంకేతమని భావిస్తారు. అలాంటి సందర్భాల్లో, ఆ రోజు జాగ్రత్తగా ఉండాలని పెద్దలు సూచిస్తారు.

ఒక పెద్దల నమ్మకం ఏమిటంటే, ఇంటి నుండి బయలుదేరిన వెంటనే పిల్లి రోడ్డును దాటితే అది అశుభం. అలా జరిగితే కొంతసేపు ఆగి తర్వాత ప్రయాణం కొనసాగించాలని సూచిస్తారు. దీపం అకస్మాత్తుగా కొండెక్కిపోవడం కూడాదురదృష్టానికి సంకేతమని భావిస్తారు. ఈ సందర్భంలో దేవుని నామస్మరణ చేయడం, ప్రార్థన చేసి బయలుదేరడం శుభప్రదమని అంటారు.

అయితే ఈ శకునాలకు శాస్త్రీయ ఆధారం లేదన్నా, జ్యోతిష్య నమ్మకాలుగా తరతరాలుగా కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణాల్లోనూ ఇప్పటికీ చాలామంది ఈ సూచనలను పాటిస్తారు. అనుభవం ఒక గురువు అన్నట్టే, చాలామంది తమకున్న అనుభవాల ఆధారంగా ఈ నమ్మకాలపై విశ్వాసం పెంచుకుంటారు. ఇక నేటి యువతలో చాలామంది వీటిని అంధ విశ్వాసాలుగా కొట్టి పారేస్తున్నా, కొంతమంది మాత్రం జాగ్రత్తగా ఉంటే మేలే అన్న ఆలోచనతో పాటిస్తూనే ఉన్నారు.