ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ను ఐసీసీ మంగళవారం రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 19న యూఏఈ వేదికగా ఐపీఎల్ 14 రెండో దశ టోర్నీ ఆరంభం అయి… అక్టోబర్ 15న ముగుస్తుంది. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. కరోనా కారణంగా ఇండియాలో జరగాల్సిన ఈ టోర్నీ వేదిక మారింది. యూఏఈ, ఒమన్ లు సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించనున్నాయి.
అక్టోబర్ 17 నుండి రౌండ్ 1లో భాగంగా.. గ్రూప్ A లో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా జట్లు, గ్రూప్ B లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ జట్లు మధ్య క్వాలిఫయర్స్ మ్యాచ్ లు జరుగుతాయి. ఒక్కో గ్రూప్ నుంచి రెండేసి జట్లు టీ20 వరల్డ్ కప్ నకు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 23 నుండి సూపర్ 12లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండిస్ జట్లు తలబడనుండగా… గ్రూప్ 2లో ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘానిస్తాన్ జట్లు పోటీ పడనున్నాయి.
ఇక అక్టోబర్ 24న దాయాది దేశమైన పాకిస్తాన్ తో ఇండియా తన తోలి మ్యాచ్ ఆడనుండటం విశేషం. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ లో ఇండియా, పాకిస్తాన్ లు తలపడిన అన్ని మ్యాచ్ లలోనూ ఇండియానే విజయం సాధించింది. అక్టోబర్ 31న న్యూజిలాండ్ తో, నవంబర్ 3న ఆఫ్ఘానిస్తాన్ తో, నవంబర్ 5న గ్రూప్ B టాప్ లో ఉన్న టీంతో, నవంబర్ 8న గ్రూప్ Aలో సెకండ్ ప్లేస్ లో ఉన్న టీంతో ఇండియా తలపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ నవంబర్ 14న దుబాయ్ వేదికగా జరగనుంది. సెమీస్, ఫైనల్ మ్యాచ్ లకు రిజర్వ్ డేను ఐసీసీ కేటాయించింది.