AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా భావించిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. గురువారం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ మీడియాతో మాట్లాడారు అయితే ఈ సమావేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు వైసీపీ పై పూర్తి స్థాయిలో విమర్శలు చేశారు.
గత ప్రభుత్వ పాపం వల్లే ఇప్పటికీ పోలవరం పూర్తి కాలేదని కేంద్రం పోలవరం కోసం జారీ చేసిన నిధులను ప్రభుత్వ విధుల కోసం మళ్ళించడం వల్లే పోలవరం పూర్తి కాలేకపోయిందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ పాప మొత్తం వైసిపిదే అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలపై మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబంటి రాంబాబు స్పందించారు.
ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పూర్తిస్థాయిలో తప్పుపట్టారు.పోలవరం నిధులు ప్రభుత్వానికి మళ్లించినట్లు రుజువు చేస్తే చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తానని అన్నారు. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబుయేనని విమర్శించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి హయామంలో పోలవరం ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి అయ్యాయని తెలిపారు.
విషయం ఏదైనా ఆ విషయం గురించి నిజాలు మాట్లాడటంలో చంద్రబాబు నాయుడు చాలా చిన్నవాడు అబద్ధాలు మాట్లాడటంలో మాత్రం ఆయన అందరికంటే చాలా పెద్దవాడు అంటూ చంద్రబాబు మాటలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.పోలవరం నిర్మాణం సమయంలో రాష్ట్ర ప్రభుత్వమే పోలవరానికి ముందుగా డబ్బులు ఖర్చు పెట్టిన తరువాత కేంద్రం రీయింబర్ చేయడానికి కేంద్రంతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఇందులో డబ్బుల మళ్లింపు ఎక్కడ ఉంటుందని అంబంటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు.