హుజూరాబాద్ ఉప ఎన్నిక: బాధ్యత భుజానికెత్తుకున్న హరీష్ రావు.?

హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి అభ్యర్థి పేరు ఖరారయ్యింది. గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరుని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు ప్రకటించారు. దాంతో, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక హోరు పతాక స్థాయికి చేరిందన్నమాట. ఇలా తమ అభ్యర్థి పేరు ప్రకటితమవగానే, అలా మంత్రి హరీష్ రావు రంగంలోకి దూకేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోపోటీ బీజేపీ – తెలంగాణ రాష్ట్ర సమితి మధ్యనేనని హరీష్ రావు వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే, ఇక్కడ హరీష్ రావు.. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని గుర్తెరగాలి. ఎందుకంటే, దుబ్బాక ఉప ఎన్నిక విషయమై బాధ్యత అంతా హరీష్ రావే తన భుజానికెత్తుకున్నారు.. కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఓడిపోయింది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేక చతికిలపడింది.

మరి, అదే సీన్ హుజూరాబాద్ నియోజకవర్గంలో రిపీట్ అవుతుందా.? అయ్యేలానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిందే ఈటెల రాజేందర్ రాజీనామాతో. గతంలో ఈటెల రాజేందర్, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పోటీ చేసి గెలిచారు, మంత్రి అయ్యారు కూడా. కానీ, తెలంగాణ రాష్ట్ర సమితిలో అంతర్గత రాజకీయాల కారణంగా మంత్రి పదవి కోల్పోయారు ఈటెల. ఆయన మీద కేసులు బనాయించింది కేసీయార్ సర్కార్. ఈ నేపథ్యంలో, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల పట్ల సానుభూతి స్పష్టంగా కనిపిస్తోంది. అందుకనే, కేసీయార్ అత్యంత వ్యూహాత్మకంగా దళిత బంధు పథకాన్ని తెరపైకి తెచ్చారు. సామాజిక సమీకరణాలు సరి చూసుకుని మరీ, గెల్లు శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. కానీ, టీఆర్ఎస్ ఏం చేసినా, ఈటెల గెలుపుని హుజూరాబాద్ నియోజకవర్గంలో అడ్డుకోవడం అంత తేలిక కాదు.