ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల నాటికీ మాదే అధికారం అంటూ పగటి కలలు కంటూ, పక్క రాష్ట్రంలో వాపును చూసుకొని అదే తమ బలమని బలంగా నమ్ముతూ రాజకీయాలు చేస్తున్న బీజేపీ పార్టీకి ఇప్పుడు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ తరుపున చెప్పుకోదగిన నేతలు ఎవరు లేరు. ఎదో కేంద్రంలో అధికారంలో ఉండటంతో కొందరు పేరున్న వలస నేతలు బీజేపీ లో ఉన్నారు తప్పితే, సొంతగా పార్టీ తరుపున ఎదిగిన నేత ఒక్కరు కూడా లేరు.
ఇలాంటి స్థితిలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహంతో రగిలిపోతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ప్రజలు, కార్మీక సంఘ నేతలతో పాటు.. రాష్ట్రంలో పలు పార్టీలు సైతం నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ రాష్ట్ర బీజేపీ మాత్రం విశాఖ ఉక్కుపై నోరెత్తడం లేదు. పైగా కేంద్రమేమైనా నిర్ణయాన్ని ప్రకటించిందా.. ఒక ట్వీటును పట్టుకుని అందరరూ ఇంత యాగీ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడడం చూస్తే వారి నిర్లక్ష్యం ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుంది.
తాజాగా బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని మోదీ తీసుకొంటున్న పలు నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా ఉంటున్నాయని చెప్పారు.. వాటికి వ్యతిరేకంగానే పార్టీ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రానికి కాంగ్రెస్ ద్రోహం చేసిన నేపథ్యంలో.. కేంద్రంలో బీజేపీ వస్తే ఎంతో మేలు జరుగుతుందని భావించారు. కానీ బీజేపీ హయాంలో ఏపీకి ఎటువంటి మేలు జరగకపోవడం చాలా బాధాకరమని ప్రకటించారు.
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం చాలా దారుణమని, దీనివల్ల ఏపీలో బీజేపీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయకపోవడం, ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీపైనా కేంద్రం మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ వేలాది మంది రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నా స్పందన లేదని విమర్శించారు. ఈ కారణాల వల్లే తాను బీజేపీని వీడాలని భావించానని చెప్పారు. కాకర నూకరాజు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు బీజేపీ ని బాగా ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా ఉంది. కేంద్రంలో అధికారాన్ని చూపించి కొందరు నేతలను పార్టీలోకి తెచ్చుకొని బలం పెంచుకోవాలని చూస్తున్న తరుణంలో ఆ కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల వలన కొద్దోగొప్పో ఉన్న నేతలు కూడా వెళ్ళిపోవటం జరుగుతుంది.