నరేంద్ర మోడీ తెలంగాణ టూర్‌పై హై ఎక్స్‌పెక్టేషన్స్.!

ప్రధాన మంత్రి తెలంగాణకు వస్తున్నారు. అధికారిక పర్యటన కాదిది. పార్టీ పరమైన పర్యటన. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైద్రాబాద్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జాతీయ కార్యవర్గ సమావేశాలు గనుక, దేశవ్యాప్త అంశాలపై బీజేపీ ప్రధానంగా ఈ సమావేశాల్లో చర్చిస్తుంది.

పార్టీ పరంగా కీలకమైన నిర్ణయాలు ఈ సమావేశాల్లో బీజేపీ అధినాయకత్వం తీసుకోనుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి, అలాగే ఈలోగా జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చ ఖచ్చితంగా జరిగి తీరుతుంది.. కీలకమైన రాజకీయ నిర్ణయాలూ తీసుకునే అవకాశమైతే లేకపోలేదు.

‘సాలు దొరా.. సంపకు దొరా..’ అంటూ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ మీద బీజేపీ సెటైర్లు, ఆ బీజేపీ మీద తెలంగాణ రాష్ట్ర సమితి కౌంటర్ ఎటాక్ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర సమితిపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చేయబోయే విమర్శలు ఎలా వుంటాయన్నది కీలకమైన అంశంగా మారింది.

తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న ధీమాతో వున్న తెలంగాణ బీజేపీ కూడా, మోడీ ప్రసంగంపై బోల్డన్ని ఆశలు పెట్టుకుంది. అదే సమయంలో, తెలంగాణ ప్రజానీకం మెచ్చేలా బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంటుందని కూడా తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. కొండంత రాగం తీసి.. అన్నట్టు చివరికి తుస్సుమనిపించేలా తెలంగాణ విషయమై బీజేపీ నిర్ణయాలు ఈ కార్యవర్గ సమావేశాల్లో వుండబోతున్నాయన్న వాదనా లేకపోలేదు.

ఏమో, ఏం జరుగుతుందో.. మరికొద్ది గంటలు ఆగితే తేలిపోతుంది కదా.!