టీడీపీ నుంచి భారీగా వ‌ల‌స‌లు..ప్ర‌తిప‌క్ష హోదా హుళక్కే!

గ‌త రెండు మూడు రోజులుగా వైకాపా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ జోరుగా కొన‌సాగిస్తున్న‌ట్లు వెబ్ స‌హా ప్రింట్ మీడియా క‌థ‌నాలు అంత‌కంత‌కు వేడెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వైకాపాలో నెంబ‌ర్-2 నాయ‌కుడిగా కొన‌సాగుతోన్న కీల‌క నేత‌తో ద‌క్షిణ కోస్తా ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు మంత‌నాలు చేస్తున్న‌ట్లు మంగ‌ళ‌వారం ఒక్క‌సారిగా ఊపందుకుంది. స‌రిగ్గా మహానాడు ముగింపు క‌ల్లా ఇద్ద‌రు ఎమ్మెల్యేలు సైకిల్ వ‌దిలి..ప్యాన్ గాలి కింద‌కు చేరుతున్న‌ట్లు ప్ర‌చారం ఠారెత్తిపోయింది. ఇది వైసీపీ వేసిన స్కెచ్..చంద్ర‌బాబు అండ్ కో జీవితాంతం గుర్తుండిపోయే ట్రీట్ లా ప్లాన్ చేసిన‌ట్లు క‌థ‌నాలు వేడెక్కించాయి. అయితే వైకాపా ఇద్ద‌రి తో కాదు ఏకంగా ఒకేసారి ఏడు నుంచి 10 మంది ఎమ్మెల్యేల‌ను లాగేసి  ప్ర‌తిప‌క్ష పార్టీనే లేకుండా చేసే యోచ‌న‌లో వైసీపీ ఉన్న‌ట్లు తాజాగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఒకేసారి అంత మంది ఎమ్మెల్యేల‌ను ఫ్యాన్ గాలికింద‌కు తెచ్చి చంద్ర‌బాబుకు భారీ షాక్ ఇవ్వాల‌నే ప్లాన్ చేస్తుంది. దీనికి త‌గ్గ‌ట్టు ఆ ఎమ్మెల్యేలు కూడా వైకాపాలో చేర‌డానికి అంతే ఉత్సాహం చూపిస్తున్నారు. వైకాపాలో చేరాలంటే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి పార్టీలో చేరాల‌ని జ‌గ‌న్ కండీష‌న్ పెట్టారు. అందుకు అన్ని ర‌కాలుగా స‌మ్మ‌తం తెలిపి స‌ద‌రు ఎమ్మెల్యేలు బ‌య‌ట నుంచైనా పూర్తి స్థాయిలో వైకాపాకి మ‌ద్ద‌తివ్వ‌డానికి ఉత్సాహం చూపిస్తారుట‌. ప్ర‌కాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి తో తెలుగు దేశం ఎమ్మెల్యేలు ఏలూరు సాంబ‌శివ‌రావు (ప‌ర్చూరు ప్రకాశం జిల్లా) అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ మంగ‌ళ‌వారం మంత‌నాలు జ‌రిపినట్లు స‌మాచారం. రెండు, మూడు రోజుల్లో వీరిద్ద‌రు త‌మ అనుచ‌ర‌గ‌ణంలో వైకాపా కండువా క‌ప్ప‌నున్నార‌ని తెలిసింది.

వీరితో పాటు మ‌రికొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ప్యాన్ వైపు మొగ్గు చూపుతున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారి తీసింది. మంగ‌ళ‌వారం రాత్రి మంత్రి బాలినేనితో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు చర్చ‌లు జ‌రిపారుట‌. అయితే మ‌రికొంత మంది ఎమ్మెల్యేలు కూడా లైన్ లో ఉండ‌టంతో వీరంద‌రితో ఏకాంతంగా మ‌రోసారి భేటి అవ్వాల‌ని మంత్రి భావిస్తున్నారుట‌. అయితే ఇదే వేడిలో రాష్ర్ట వ్యాప్తంగా వివిధ ఏరియాల్లో ఉన్న ఎమ్మెల్యేలు జంపింగ్ స‌న్నాహాలు చేస్తున్నారు. వారిలో వాసుప‌ల్లి గ‌ణేష్(విశాఖ సౌత్), గ‌న‌బాబు (విశాఖ వెస్ట్) , గొట్టిపాటి ర‌వి ( ప్ర‌కాశం జిల్లా అద్దంకి), బాల వీరాంజ‌నేయులు ( ప్ర‌కాశం జిల్లా కొండెపి) మంతెన రామ‌రాజు ( ప‌శ్చిమ‌గోదావ‌రి, ఉండి), జోగేశ్వ‌ర‌రావు( తూర్పు గోదావ‌రి మండ‌పేట‌) నియోజక వ‌ర్గాల‌కు చెందినిన శాస‌న స‌భ్యులు కూడా అదిష్టానానికి ట‌చ్ లో ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. వీరంతా ప్యాన్ కింద‌కు చేరితే ప‌య్యావుల కేశ‌వ్( అనంత‌పురం, ఉర‌వ‌కొండ‌), బి. అశోక్ (ఇచ్చాపురం, శ్రీకాకుళం) కూడా వైకాపా కండువా క‌ప్పుకోవ‌డానికి రెడీగా ఉన్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఎలాగైనా వీరంద‌ర్ని వైకాలోకి లాగి టీడీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌కుండా చేయాల‌ని జ‌గ‌న్ వ్యూహా ర‌చ‌న చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.