అధికార పార్టీ వైకాపాకి అసమ్మతి సెగ తగిలిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలనపై సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రజలు సంతోషంగా ఉన్నా..కొందరు సొంత పార్టీ నేతలు మాత్రం అసమ్మతి గళాన్ని వినిపించే ప్రయత్నా చేసారు. అధికారంలో ఉండి కూడా తమ నియోజక వర్గాల్ని అభివృద్ది పరుచుకోలేదంటూ పార్టీపై తిరగబడే ప్రయత్నం చేసారు. సీఎం అసలు తమను కలిసి మాట్లాడి చాలా కాలమైంది. మా సమస్యలు అతనికెలా తెలుస్తాయంటూ అసంతృప్తిని వ్యక్తం చేసారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఓ అడుగు ముందుకేసి సీఎం మాటనే అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇక మాలాంటి వారిని ఎలా గుర్తిస్తారంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు.
ఇంకా వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహాందర్ రెడ్డి, కడప, అనంతపురం జిల్లాల ఎమ్మెల్యేలు రఘురామ కృష్ణం రాజు, చంద్రశేఖర్ సైతం పదవుల్లో ఉండి కూడా ఏడాదిలో చేసిందేమి లేదని బాహటంగానే ప్రకటించారు. ఇంకా తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఇసుక పంపిణీ విషయంలో ఫెయిలయ్యామని విమర్శలు చేసారు. ఇంకా పార్టీలో ఉన్న ఇంకొంత మంది జగన్ తీరుపై నీరు గారారు. అయితే ఈ అసమ్మతి సెగపై జగన్ కార్యచరణ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరం. జగన్ నియంత పాలకుడని కొన్ని విమర్శలున్నాయి.
ఆయన మాట తప్ప ఇంకెవ్వరి మాట వినరని ఆరోపణలున్నాయి. అలాంటి వ్యక్తిత్వం గల సీఎం ఏడాది పాలనపై సొంత పార్టీ నేతలే నివురు గప్పిన నిప్పులా అసమ్మతి గళాన్ని వినిపిస్తే?జగన్ ఎలా రియాక్ట్ అవుతారు? అన్న దానిపై ఆసక్తికర రచ్చ రాజకీయ వర్గాల్లో తలెత్తింది. ఈ అసమ్మతిని తెలివిగా కప్పిపుచ్చడంగానీ, కవర్ చేయడం గానీ చేయోచ్చని అంటున్నారు. అంతేగానీ జగన్ మాత్రం సదరు ఎమ్మెల్యేలను బుజ్జగించే కార్యక్రమం మాత్రం పెట్టుకోరని వినిపిస్తోంది. ఆయన సీఎం అయినప్పుడే ప్రజలకు సేవకులుగా ఉండాలిగానీ…ప్రభుత్వానికి కాదంటూ నినదించారు. జగన్ మాట తప్పడు..మడము తిప్పడు కాబట్టి! ఇది ఖాయం చేసుకోవాల్సిందే.