మానవ శరీరానికి స్వేదం లేదా చెమట అనేది సర్వసాధారణమైన విషయం. స్వేదం ద్వారానే శరీరం లోపల విడుదలైన మలినాలను బయటకు విసర్జింపబడతాయి. బాడీలోని వేడిని తగ్గించటం వలన శరీర సమతుల్యతను స్వేదం కాపాడుతుంది. అందుకే చెమట పట్టడం ఆరోగ్యానికి సూచికగా భావిస్తారు. అయితే కొంతమందికి చెమటలు చాలా తక్కువగా పడతాయి. మరికొంతమందికి కాస్త శ్రమపడితే చాలు విపరీతంగా చెమటలు వచ్చేస్తుంటాయి. ఈ ఎక్కువ చెమటలు పట్టడం వల్ల కొన్ని సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఒంటి నుంచి దుర్వాసన రావడం, వేసుకున్న బట్టలు తడిగా కనిపిస్తూ రంగు మారతాయి. అలానే ఆరోగ్యం మీద పడే ప్రభావం వేరుగా ఉంటుంది.
అసలు చెమటలు ఎందుకు పడతాయి? అంటే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. థైరాయిడ్, డయాబెటిస్, హైపర్ టెన్షన్, లేదా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా ఈ అధిక చెమటకు కారణమవుతాయి. ఎక్కువ చెమటలు పట్టడం అంటే హైపర్ హైడ్రోసిన్ అనే సర్వసాధారణమైన సమస్య. ముఖ్యంగా వేసవిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. మరి వీటి నుంచి విముక్తి లేదా… అంటే ఉంది. ఇంట్లోనే కొన్ని చిట్కాలతో ఈ అధిక చెమట వలన ఎదురయ్యే సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు.
వెనిగర్ లో ఉండే రక్తస్రావాన్ని ఆపే గుణం వల్ల చెమటలు అధికంగా పట్టడాన్ని అదుపులో పెట్టవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్, ఒక టేబుల్ స్పూన్ తేనెను ఓ గ్లాసు నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నిమ్మకాయ రసాన్ని మీ అండర్ ఆర్మ్స్ లో రుద్దుకుని చల్లటి నీటితో కడిగేయటం వలన చెమట కంట్రోల్ అవటమేకాక సహజసిద్ధమైన డియోడ్రెంట్ గా పనిచేస్తుంది. కొబ్బరినూనెలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొబ్బరినూనెను అరిచేతిలో వేసుకుని చెమటలు ఎక్కువగా పట్టే ప్రాంతంలో రాస్తే అధిక చెమట నుంచి ఉపశమనం లభిస్తుంది.
అలోవెరా జెల్ లో చల్లదనాన్ని అందించే లక్షణం ఉంటుంది. ఈ జెల్ ను చెమటలు ఎక్కువగా పట్టే ప్రాంతంలో నేరుగా రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బేకింగ్ సోడా చెమట వల్ల శరీరం నుంచి వచ్చే దుర్వాసన పోగొడుతుంది. బేకింగ్ సోడాను కొంచెం నీటిలో కలిపి చంకల్లో రుద్దుకుని కాసేపటి తరువాత నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. బ్లాక్ టీలో ఉండే టానిక్ ఆసిడ్… రక్తస్రావాన్ని ఆపే లక్షణాలతో పాటు, చెమటను ప్రభావవంతంగా అదుపులో పెడుతుంది. చల్లటి బ్లాక్ టీలో ఓ శుభ్రమైన బట్టను ముంచి దాంతో చంకల్లో రుద్దుకోవడం వల్ల అధిక చెమట సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.