ఏపీ ప్రభుత్వానికి పలు అంశాలో హైకోర్టు మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. రంగుల జీవో దగ్గర్నుండి నిమ్మగడ్డ తొలగింపు వరకు పలు అంశాల్లో ప్రభుత్వ నిర్ణయాలను హైకోర్టు తప్పుబడుతూ వచ్చింది. ఇలా న్యాయస్థానం ముందు జగన్ సర్కార్ పదే పదే చిన్నబోవడంతో విపక్షం టీడీపీ చాలా హ్యాపీగా ఉంది. అధికార పక్షాన్ని తామేమీ చేయలేకున్నా హైకోర్టు నిలువరిస్తుండటం, అడ్డుపడుతుండటంతో సంబరపడుతోంది. ఆహా.. ఓహో.. అంటూ కోర్టులను, న్యాయ వ్యవస్థను ఆకాశానికెత్తేస్తోంది. దీన్ని తట్టుకోలేక పోయిన వైసీపీ నేతలు చంద్రబాబు కోర్టులను మేనేజ్ చేస్తున్నారని విపరీత వ్యాఖ్యలు చేయడం స్టార్ట్ చేశారు. కోర్టు తీర్పులు బాబుకు ముందే ఎలా తెలుస్తున్నాయి, అసలు బాబు, న్యాయమూర్తుల కాల్ డేటాను పరిశీలించాలని అన్నారు.
ఈ మాటలతో అధికార పార్టీ నేతలు మరింత అబాసుపాలయ్యారు. అసలు కోర్టులు చంద్రబాబు అదుపులో ఉండటం ఏమిటని ముక్కున వేలేసుకున్నారు జనం. కోర్టు కూడా న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బ తీసేలా మాట్లాడితే ఊరుకునేది లేదని వైసీపీ నేతలకి ఉత్తర్వులు జారీ చేసింది. అయినా వైసీపీ నేతల్లో అపార్థం మాత్రం తొలగలేదు. తాజాగా రాజధానిగా తరలింపు మీద స్టేటస్ కో ఇవ్వడం, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో ప్రభుత్వం అవలంభిస్తున్న విధానం తప్పని అనడంతో ఆ అసహనం ఇంకా పెరిగిపోయింది. తాజాగా ఆ అపార్థాన్ని పటాపంచలు చేసేలా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ రైతులు, ఇంకొందరు 70కి పైగా పిటిషన్లు వేశారు. వాటిలో కొన్నిటిలో రాజధాని తరలింపు దురుద్దేశ్యమని, ఇందులో ఇతర రాజకీయ పార్టీలు కూడ భాగస్వామ్యమయ్యాయని అంటూ గతంలో పలు సందర్భాల్లో ప్రముఖ పార్టీల నేతలు అమరావతి కి అనుకూలంగా చేసిన వ్యాఖ్యాలను పిటిషన్లో పొందుపరిచారు. వాటిని పరిశీలించిన న్యాయస్థానం వైఎస్ జగన్, మంత్రివర్గం, టీడీపీ, బీజేపీ లకు గత వ్యాఖ్యపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామంతో హైకోర్టు కు వైసీపీ, టీడీపీ అనే తేడాలు లేవని, కోర్టు ఎవరి పక్షపాతి కాదని, అందరినీ సమానంగానే చూస్తుందని, తప్పు ఎవరివైపు ఉన్నా చర్యలు తప్పవని నిరూపించింది. మరి ఈ పరిణామంతో అయినా వైసీపీకి న్యాయ వ్యవస్థ మీద ఉన్న అపోహలు తొలగుతాయేమో చూడాలి.