Heavy Rain : పొరుగు రాష్ట్రంలో రోడ్లు బాగాలేవు.. కరెంటు లేదు, నీళ్ళ సమస్య వుంది.. అంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఆ తర్వాత నాలిక్కరచుకుని ‘సారీ’ చెప్పిన సంగతి తెలిసిందే.
తాజాగా, హైద్రాబాద్‌లో అకాల వర్షం కురిసింది. తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదయ్యేసరికి, విశ్వనగరం హైద్రాబాద్‌లోని పలు ప్రాంతాలు నీటి ముంపుకి గురయ్యాయి. జనజీవనం ఆయా ప్రాంతాల్లో అస్తవ్యస్థమయ్యింది.
‘కేటీయార్ సారూ.. విశ్వనగరం హైద్రాబాద్ నీట మునిగింది..’ అంటూ వైసీపీకి చెందిన మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా, పలు వీడియోలను షేర్ చేస్తున్నారు. హైద్రాబాద్ అభివృద్ధి చెందిన నగరమే అయినా, దేశంలోని ప్రధాన నగరమే అయినా.. వర్షం వస్తే.. హైద్రాబాద్ అతలాకుతలమైపోవడం కొత్తేమీ కాదు.
గత పాలకుల దుర్మార్గం.. అంటూ నిన్న మొన్నటిదాకా టీఆర్ఎస్ తమ వైఫల్యాల్ని సమైక్య పాలకుల మీద రుద్దేసిన వైనం చూశాం. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. ఎనిమిదేళ్ళయ్యింది తెలంగాణలో గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇదే విషయాన్ని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు స్పష్టంగా పేర్కొంటున్నారు.
అయితే, వర్షాలు కురిస్తే హైద్రాబాద్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా అతలాకుతలమైపోతుంది. ఆ విషయాన్ని వైసీపీ మద్దతుదారులు మర్చిపోతే ఎలా.?