రాత్రివేళ ఆహారం ఆలస్యమా..? జంక్ ఫుడ్, స్నాక్స్ కూడానా..? అయితే ఇబ్బందులే..!!

రాత్రి ఎనిమిది గంటల్లోపే తినేయాలి. డాక్టర్లు, ఆహార నిపుణులే కాదు.. ఇంట్లో పెద్దవారు కూడా చెప్పే మాట ఇదే. తిన్న తర్వాత రెండు గంటల సమయం కూడా ఇవ్వాలి.. రాత్రిపూట జీర్ణక్రియ వేగం తక్కువగా ఉంటుదనేది నిజం. కానీ.. నేడు అర్ధరాత్రి తిండే ఒక ఫ్యాషన్. ఫుడ్ కోర్ట్స్ వంటివి వచ్చాక.. సెకండ్ షో సినిమానే కాదు.. మల్టీప్లెక్స్ లో లాస్ట్ షో తర్వాత కూడా ఫుడ్ దొరుకుతుంది.. తింటున్నారు కూడా. అయితే.. పనిలో పడో, కుదరకో ఎప్పుడోసారి ఇలా రాత్రి లేట్ గా తింటే అది పరిస్థితుల ప్రభావం అనొచ్చు. కానీ.. ఇదే అలవాటుగా చేసుకుంటే మాత్రం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు.

రాత్రిపూట మనం పడుకోబోయే రెండు గంటల ముందే తినేయాలి. తిన్నవెంటనే నిద్ర కూడా మంచిది కాదు. రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగేందుకు ఆస్కారం ఉంది. డయాబెటిస్ కు కారణమవుతుంది. నైట్ షిఫ్ట్ వర్క్ చేసే వాళ్లు కూడా త్వరగా తినేయాలి. నైట్ వర్క్ కదా.. అని లేట్ గా తినడం మంచిది కాదని..
పోష‌కాహార నిపుణులు, వైద్యులు అంటున్నారు. రాత్రిళ్లు తీసుకునే ఆహారానికి నిద్రకు మధ్య సమయం ఇవ్వకపోతే బ్లడ్ లో షుగర్ పెరగడమే కాదు.. కొవ్వు కూడా పెరిగి గుండె సమస్యలు కూడా వస్తాయి. నైట్ ఫుడ్ లో స్నాక్స్, జంక్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే మెదడుపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువ. రాత్రిళ్లు టీవీ, మూవీ, ఫోన్ చూస్తూ తినే చిరుతిళ్లు వల్ల ఈ ప్రమాదం ఉంటుందని అంటున్నారు.

కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కొన్నేళ్లపాటు జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెలుగు చూశాయి. వారు నిద్రపోయే ముందు జంక్‌ఫుడ్‌, స్నాక్స్ ఎక్కువగా తినే వారిపై పరిశోధనలు జరిపారు. వారిలో మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిలో ఇబ్బందులు వచ్చినట్టు గుర్తించారు. ఇవన్నీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపేవి కాబట్టి రాత్రిపూట ఆహారంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

గమనిక: ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. ఈ వివరాలు వైద్యులు, నిపుణుల ఆయా సందర్భాల్లో తెలిపిన వివరాలనే అందించాం. ఆహారం విషయంలో ఎటువంటి సలహాలైనా, ఆరోగ్య సంబంధిత విషయాలపైనైనా సందేహాల కోసం వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. పై సమాచారానికి ‘తెలుగు రాజ్యం’ బాధ్యత వహించదు.