Health Tips: చలికాలం వచ్చిందంటే చాలు చర్మం మీద మచ్చలు, దురదలు, చర్మం పొడిబారిపోవడం వంటి సమస్యలు తరచూ వస్తుంటాయి. చర్మం కాంతివంతంగా కనిపించదు. చలికాలంలో చర్మ ఆరోగ్యం పైన ఎక్కువగా దృష్టి సారించాలి. చలికాలంలో ఎక్కువగా డ్రై స్కిన్ ఉన్న వారు ఇబ్బంది పడుతుంటాయి. జిడ్డు చర్మం వారికి కూడా ఈ సమస్యలు అధికంగానే ఉంటాయి, కాకపోతే డ్రై స్కిన్ వారి కంటే తక్కువ ఉంటాయి. అయితే ఈ చర్మ సమస్యల నుండి బయటపడటానికి మాయిశ్చరైజర్లు, లోషన్లు, క్రీముల మీద అధికంగా ఆధారపడి ఉంటారు. పూర్వము చర్మ సంరక్షణ కోసం పెద్దవారు ఎక్కువగా ఇంట్లో శెనగపిండిని వాడి స్నానం చేసేవారు. అయితే ఇప్పుడు రకరకాల సబ్బులు వాడుతుంటారు.
శీతాకాలపు వాతావరణంలో మీ చర్మం సహజమైన నూనెను కోల్పోతుంది. దీని వల్ల మీ చర్మం కఠినంగా, పొడిగా, నిర్జీవంగా మారిపోతుంది. దీనిని డ్రై స్కిన్ అని అంటారు. అదే డి హైడ్రేటెడ్ స్కిన్ సమస్య ఉన్నవారి చర్మం చాలా మృదువుగా, సున్నితంగా ఉంటుంది. ఇటువంటి చర్మ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా మాయిశ్చరైజర్ ల మీద ఆధారపడుతుంటారు. శీతాకాలంలో చర్మ సమస్యల గురించి మీరు ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఇంటి లోని కొన్ని టిప్స్ పాటించడం వల్ల మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.
కొబ్బరి నూనె, బాదం నూనె, షియా వెన్న, అలోవెరా జెల్ అన్ని ఒక్కొక్క స్పూన్ తీసుకుని వాటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని లోషన్ లాగా చర్మానికి పూస్తే గనుక స్కిన్ మృదువుగా, తేమను కోల్పోకుండా, కోమలంగా ఉంటుంది.
ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల టమోటా పేస్ట్, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ గ్రీన్ టీ వేసుకొని బాగా కలిపి మిశ్రమం లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాలు అలాగే ఉంచి, అనంతరం బాగా రుద్దుకొని మొహం కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలు చేయడం వల్ల మీ మొహం మీద మొటిమలు, మచ్చలు తగ్గిపోయి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
చలికాలంలో కొందరిలో చర్మం మీద దురదలు వస్తుంటాయి. అలాంటివారు ఆలివ్ ఆయిల్, ఆముదం రెండింటినీ బాగా కలిపి దురదలు ఉన్నచోట రాయటం వల్ల చర్మం మీద దురద సమస్యలు తగ్గిపోతాయి.
శీతాకాలంలో చర్మ సమస్యలు తగ్గాలంటే సిట్రస్ పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తింటూ ఉండాలి. శరీరానికి సరిపడా నీటిని అందించాలి. రోజు వ్యాయామాలు చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించి మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.