హరీష్ వర్సెస్ ఈటెల: మాటల యుద్ధం ముదురుతోంది.!

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదుగానీ, ఈలోగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితికీ, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కీ మధ్య మాటల యుద్ధం మాత్రం పతాక స్థాయికి చేరుకుంది. మరీ ముఖ్యంగా మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మధ్య విమర్శల తూటాలు బీభత్సంగా పేలుతున్నాయ్. ఈటెల రాజేందర్, హుజూరాబాద్ నియోజకవర్గానికి ఏమీ చేయలేదన్నది హరీష్ రావు నిన్న చేసిన ఆరోపణ. ‘నేను నియోజకవర్గానికి ఏం చేశానో నాతో వస్తే చూపిస్తా..’ అంటూ ఈ రోజు ఈటెల రాజేందర్, మంత్రి హరీష్ రావుకి సవాల్ విసిరారు. మరి, ఆ సవాల్ స్వీకరించి హరీష్ రావు, ఈటెల వెంట హుజూరాబాద్ పర్యటనకు వెళతారా.? అన్నదే వేచి చూడాల్సిన అంశం.

అయితే, రాజకీయాల్లో ఎడాపెడా ఆరోపణలే తప్ప.. సవాళ్ళను స్వీకరించే పరిస్థితి చాలా చాలా అరుదు. ఈటెల హయాంలో హుజూరాబాద్ అభివృద్ధి చెందలేదని హరీష్ రావు చెప్పడం ద్వారా తెలంగాణ ప్రభుత్వమే, హుజూరాబాద్ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిందన్న సంకేతాలు వెళ్ళిపోయాయి. ప్రస్తుతం బీజేపీ తరఫున పోటీ చేయబోతున్న ఈటెల రాజేందర్ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అత్యుత్సాహమే.. ‘కమలం’ పార్టీకి కలిసొస్తోంది.. గులాబీ పార్టీని దెబ్బ తీస్తోంది. పెద్దయెత్తున హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికార పార్టీ డబ్బు ఖర్చు చేస్తోందని పదే పదే ఈటెల రాజేందర్ ఆరోపిస్తున్న విషయం విదితమే. ఆ ఆరోపణలకు తగ్గట్టుగానే హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికార పార్టీ అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.