కేసీయార్‌ని వెన్నుపోటు పొడవాలనుకున్న హరీష్ రావు.?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీయార్ మీద మేనల్లుడు హరీష్ రావు.. వెన్నుపోటు రాజకీయాలకు ప్రయత్నించారా.? మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చేసిన ఈ ఆరోపణల్లో నిజమెంత.? కొన్నాళ్ళ క్రితం మంత్రి హరీష్ రావుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ రాజకీయంగా పక్కన పెట్టాలనుకున్న మాట వాస్తవం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అంతకు ముందు వరకూ హరీష్ రావు చూపిన శ్రద్ధ అంతా ఇంతా కాదు. కానీ, ఆ క్రెడిట్ హరీష్ రావుకి దక్కకుండా చేయడంలో కేసీయార్ సక్సెస్ అయ్యారు. ఆ సమయంలో హరీష్ రావుకి మద్దతుగా కేసీయార్‌కి వ్యతిరేకంగా చిత్ర విచిత్రమైన రాజకీయాలు నడిచాయి. అయితే, కేసీయార్ విషయంలో తానెప్పుడూ వేరే మాటలు మాట్లాడలేననీ, కేసీయార్ ఆదేశాల మేరకే తాను నడచుకుంటాననీ పలు సందర్భాల్లో హరీష్ రావు చెబుతూ వచ్చారు.

కానీ, హరీష్ రావు అభిమానుల్లో చాలామంది ఇప్పటికీ కేసీయార్, కేటీయార్, కవిత మీద సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూనే వుంటారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో, హరీష్ రావు అత్యంత బాధ్యతాయుతంగా తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు కోసం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో హరీష్ రావు, తన పాత సహచరుడు ఈటెల రాజేందర్ మీద ఘాటైన విమర్శలు చేయక తప్పడంలేదు. ఈ నేపథ్యంలో ఈటెల నుంచి కూడా కౌంటర్ ఎటాక్ చాలా తీవ్రంగా వస్తోంది. ‘నీ బలం పెంచుకోవడానికి నువ్వు ప్రయత్నించలేదా.? ఈ క్రమంలో నువ్వు కేసీయార్ ఆగ్రహానికి గురి కాలేదా.? నువ్వు ముఖ్యమంత్రి పదవి మీద కన్నేసిన మాట వాస్తవం కాదా.?’ అంటూ ఈటెల సంధించిన ప్రశ్నలు తెలంగాణ రాష్ట్ర సమితిలో కొత్త చర్చకు తెరలేపాయి. నిజమేనా.? కేసీయార్ విషయంలో హరీష్ రావు రెండో ఆలోచన చేశారా.? అని చర్చించుకుంటున్నారు గులాబీ నేతలు.