శ్రీరాముడెక్కడ జన్మించాడు.? వెంకటేశ్వరస్వామి జన్మస్థలమేది.? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే ఏ ప్రశ్నకీ సరైన సమాధానం దొరకదు. శివుడు ఎక్కడ జన్మించాడని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పగలం.? దేవుళ్ళ జన్మస్థలాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి భక్తుల్లో వుండడం సహజమే. కానీ, మనుషులకు.. దేవుళ్ళ జన్మస్థలాలేంటో డిసైడ్ చేసేంత సీన్ వుందా.? తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకు హనుమంతుడి జన్మస్థలంపై ఆసక్తి చూపుతోంది.? అన్నదానిపై భిన్నవాదనలు వున్నాయి. హనుమంతుడు, తిరుమల గిరుల్లోనే జన్మించాడంటూ ఇటీవల ఉగాది పర్వదినాన టీటీడీ ప్రకటన చేసింది. దాంతో, దేశవ్యాప్తంగా హనుమంతుడి భక్తులు భిన్న వాదనలు వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాలు, హనుమంతుడు జన్మించింది తమ రాష్ట్రంలోనేనంటూ నినదించడం మొదలు పెట్టాయి. నిజానికి, ఎప్పటినుంచో వున్న చర్చే ఇది. ఇలాంటి విషయాల్లో ‘డిక్లరేషన్’ అస్సలేమాత్రం సబబు కాదు. సరే, డిక్లరేషన్ వచ్చింది.. తలెత్తే వివాదాలకు ముందే టీటీడీ సిద్ధమయి వుండాల్సింది. హనుమంతుడి జన్మస్థలం కిష్కింద.. అంటూ కొందరు తెగేసి చెబుతున్నారు.
హనుమద్ జన్మభూమి ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి, తాజాగా టీటీడీతో చర్చించారు హనుమంతుడి జన్మస్థలం విషయమై. హనుమంతుడి జన్మస్థలానికి సంబంధించి వివాదాలు అనవసరం అనీ, రామాయణం ప్రకారం కిష్కిందనే మారుతి జన్మస్థలమనీ ఆయన స్పష్టం చేశారు. నిజానికి, ఇప్పుడు జీవించి వున్నవారెవరూ హనుమంతుడి జన్మస్థలంపై సర్టిఫికెట్లు ఇవ్వడానికి వీల్లేదు. హనుమంతుడి కాలంలో జన్మించి వున్నవారు మాత్రమే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరు. ఆ అవకాశాల్లేవుకాబట్టి.. ఆనాటి శాసనాలూ లేవు కాబట్టి.. హనుమంతుడి జన్మస్థలంపై వివాదాలు అనవసరం.