Sankranthi Cinemas In AP : ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సినిమాలకు లైన్ క్లియర్.!

Sankranthi Cinemas In AP : టెన్షన్ తొలగిపోయింది. సంక్రాంతి సినిమాలకు ఆంధ్రప్రదేశ్‌లో ఇబ్బందులు లేనట్టే. నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో రాష్ట్రంలో పలు థియేటర్లను అధికారులు సీజ్ చేయగా, వాటిని తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. నెల రోజుల్లోగా లోపాల్ని సరిదిద్దుకోవాల్సిందిగా ప్రభుత్వం, థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించింది.

‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకి తీవ్రమైన ఈ సమస్య, సంక్రాంతి సినిమాలకొచ్చేసరికి ముందుగానే తొలగిపోవడంతో, పరిశ్రమ ఊపిరి పీల్చుకుంటుందనే చెప్పాలి. ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు.. అందునా పాన్ ఇండియా సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్ల లొల్లితో తెలుగు సినీ పరిశ్రమ ఆందోళన చెందింది.

ప్రభుత్వం సోదాలు షురూ చేయడంతో, చాలా థియేటర్ల యాజమాన్యాలు స్వచ్ఛందంగా తమ థియేటర్లను మూసివేయాల్సి వచ్చింది. దానికి తోడు, టిక్కెట్ల ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, మరికొన్ని థియేటర్లను మూసేశారు. అయితే, ప్రస్తుతానికి సీజ్ చేసిన థియేటర్లను తెరచుకునేందుకే ప్రభుత్వం అనుమతిచ్చింది.
టిక్కెట్ల ధరల విషయమై కూడా కొద్ది రోజుల్లోనే తీపి కబురు వస్తుందని పరిశ్రమ పెద్దలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఆశాభావంతో వున్నారు.

ఇదిలా వుంటే, ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాల కోసం టిక్కెట్ల ధరల్ని పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుందా.? అన్నదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే వుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రాలివి. అదనపు షోలు కూడా ఈ సినిమాలకి అవసరం. మరి, ప్రభుత్వం ఏం చేస్తుందో.!