Rats Problem: ఎలుకల బెడద ఉందా..? వంటింటి చిట్కాలతో తరిమికొట్టండి

Rats Problem: ప్రతి ఇంట్లో ఎలుకల సమస్య ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లకు వంటింట్లో వీటి బెడద ఎక్కువ. మూలలు, మిద్దెల మీద, సిలెండర్ల వెనక, జాడీల వెనుక నక్కి ఇబ్బంది పెడతాయి. ఇంట్లోనే దూరితే దాన్ని పట్టుకోవడం కష్టం. ఇలా ఎలుకలు చేసే హడావిడి.. పెట్టే ఇబ్బంది మామూలుగా ఉండదు. అందుకే వీటిని తరిమికొట్టాలి. అందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే.. ఎలుకల బెడద ఉండదు.

ఎలుకల్ని తరిమికొట్టేందుకు.. ఉప్పుచేప ముక్క, ఉల్లిపాయ ముక్కల్ని ఎరవేసి బోనులో పడేలా చేస్తారు. ఇది కాకుండా ఎలుకల మందు, పెస్ట్ కంట్రోల్ మందు కూడా ఉపయోగిస్తారు. ఇవన్నీ హానికారక రసాయనాలే. ఇవి గాల్లో కలిస్తే మనకు కూడా హాని కలుగుతుంది. అందుకే.. ఇటువంటివి కాకుండా సహజమైన పద్ధతుల్లో, పదార్థాలతో ఎలుకలను తరిమేయొచ్చు. ఈ చిట్కాలు పాటించడం ద్వారా..

ఉల్లి కోస్తే మనకు కన్నీళ్లు వస్తాయి. అదే ఎలుకలైతే ఆ వాసనను తట్టుకోలేవు. ఉల్లిని నాలుగైదు ముక్కలుగా కోసి గదుల మూలల్లో ఉంచితే సరి. అయితే.. వీటి పవర్ ఫ్రెష్ గా ఉండేలా రెండు రోజులకోసారి కొత్తగా ఉల్లి ముక్కలను మార్చి మార్చి పెడితే.. తక్కువ సమయంలోనే ఎలుకలు పరారవుతాయి. పెప్పర్‌మింట్ ఆయిల్‌ కూడా ఎలుకలను తరిమికొట్టేందుకు ఉపయోగపడుతుంది. దూదిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చుట్టాలి. వాటిని పెప్పర్‌మింట్ ఆయిల్‌లో ముంచి ఇంట్లో ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో ఉంచాలి. పిప్పర్‌మెంట్ ఆయిల్ వాసన వాటికి పడదు.

కారం కూడా ఎలుకలను తరిమికొట్టేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఎండుమిర్చిని అప్పుడప్పుడూ ఇంట్లో కాలుస్తూ ఉంటే ఆ ఘాటుకి ఎలుకలు పారిపోతాయి. మరోలా అయితే.. ఒక వస్త్రంలో కొంత కారం పొడి వేసి ఎలుకలు తిరిగేచోట ఉంచాలి. ఇలా చేస్తే ఎలుకలే కాదు.. చీమలు, బొద్దింకలతోపాటు ఇతర క్రిమి కీటకాలు వెళ్లిపోతాయి.

లవంగాల ఘాటు వాసన కూడా ఎలుకలను ఇబ్బంది పెడుతుంది. అందుకే ఒక వస్త్రంలో కారం వేసినట్టుగానే కొన్ని లవంగాలు వేసి ఇంటి మూలల్లో ఉంచితే ఎలుకలు కనబడకుండా పోతాయి. బేకింగ్ పౌడర్ కూడా ఎలుకల్ని బయటకు పంపేస్తాయి. రాత్రివేళల్లో ఇంటి మూలలు, గోడల అంచుల్లో బేకింగ్ పౌడర్ చల్లి ఉదయాన్నే శుభ్రం చేయాలి. ఈ పౌడర్ దెబ్బకి ఎలుకలు పారిపోతాయి.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో నిపుణులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. గమనించగలరు.