శ్రావణ మాసం ప్రారంభమైనప్పుడు చాలామంది ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకువస్తారు. ఉపవాసాలు, మృదులైన ఆహారం వంటి పరమ్పరలతో ఈ మాసం సాంప్రదాయాలను పాటిస్తుంటారు. ముఖ్యంగా మాంసాహారాన్ని మానేసి శాకాహారానికి మొగ్గు చూపడం, అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి పదార్థాలను తినరు. దీని వెనుక కేవలం మతపరమైన ఆచారంగా మాత్రమే కాకుండా శాస్త్రీయంగా కూడా బలమైన కారణాలున్నాయి.
పురాణాల ప్రకారం ఉల్లిపాయ, వెల్లుల్లి తామసిక లక్షణాలు కలిగి ఉన్న ఆహారాలుగా పరిగణించబడతాయి. ఇవి శరీరాన్ని కేవలం శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా అశాంతికి గురిచేస్తాయని చెప్పబడింది. శ్రావణ మాసంలో ఉపవాసాలు, ఆధ్యాత్మిక సాధనలు ఎక్కువగా ఉన్న సందర్భంలో మనస్సు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం అవసరం. అందుకే, అలాంటి ఆహార పదార్థాలను నివారించడం వల్ల ధ్యానానికి, పూజలకి సహజంగా దోహదపడుతుంది.
ఇదే విషయాన్ని శాస్త్రీయంగా చూస్తే, వర్షాకాలంలో మన జీర్ణవ్యవస్థ సహజంగానే కొంచెం మందగిస్తుంది. వాతావరణంలో తడి, తక్కువ శరీర చలనం, కొంత మారిన జీవనశైలి. ఈ సమయంలో ఉల్లిపాయ, వెల్లుల్లి లాంటి పదార్థాలు కొంత బరువు పదార్థాలుగా మారి జీర్ణక్రియపై ఒత్తిడిని కలిగించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఈ మాసంలో తేలికపాటి ఆహారమే మంచిదని వారు సూచిస్తున్నారు.
ఇక శ్రావణంలో ఆహారాన్ని ఎంచుకోవడంలోనూ కొంత జాగ్రత్త అవసరం అంటున్నారు నిపుణులు. మూంగ్ పప్పుతో చేసిన ఖిచ్డీ, చిల్లా వంటి తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అల్లం టీ, తులసి టీ వంటి హెర్బల్ డ్రింక్స్ ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే వర్షాకాలంలో ఉండే కొన్ని ప్రత్యేకమైన కూరగాయలు, పండ్లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ వీటిని వాడేముందు శుభ్రంగా కడగడం తప్పనిసరి. వర్షాకాలంలో నీటిమీద వ్యాపించే క్రిములు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఏ పండు లేదా కూరగాయ అయినా నీటితో రెండు మూడు సార్లు శుభ్రం చేసుకున్నాక మాత్రమే వాడాలి.
ఇవన్నీ చూస్తే, శ్రావణ మాసంలో పండితులు, పెద్దలు పాటించే ఆచారాల వెనక అంతర్లీనంగా ఒక శాస్త్రీయత.. ఆరోగ్య పరిరక్షణ దృక్కోణం కనిపిస్తుంది. కనుక ఈ మాసంలో ఆచారాల్ని కేవలం సంప్రదాయంగా కాకుండా, అవి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకున్న చక్కటి మార్గదర్శకాలుగా తీసుకోవచ్చు. అంతేకాదు, మనం భౌతికంగా, మానసికంగా శుభ్రంగా ఉండే ఒక పవిత్ర సమయంగా కూడా శ్రావణాన్ని ఆస్వాదించవచ్చు.
