IAF Chopper Crash: సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణం… ఈ దేశం నిన్ను ఎన్నటికీ మరువదు

Bipin-Rawat

IAF Chopper Crash: ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూలిన ఘటనలో సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణించారని భారత వైమానిక దళం (IAF) ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో 12 మంది ప్రాణాలు విడిచారు. జనరల్ రావత్ సతీమణి మధులిక కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటం శోచనీయం. భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా బిపిన్‌ రావత్‌ ను కేంద్రం నియమించిన రెండేళ్లకే ఇలా జరగటం దురదృష్టకరం.

ఈ దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఏకైక ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ వరుణ్‌ సింగ్‌ తీవ్ర కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం. ముగ్గురు వైద్యులతో కూడిన బృందం ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారని తెలుస్తుంది. “భారతదేశపు మొదటి CDSగా, జనరల్ రావత్ రక్షణ సంస్కరణలతో సహా మన సాయుధ దళాలకు సంబంధించిన విభిన్న అంశాలపై పనిచేశారని, ఆయన చేసిన విశేష సేవలను భారతదేశం ఎన్నటికీ మరువదని” ప్రధాని మోదీ నివాళులు అర్పించారు.

అలానే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రావత్‌ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ… ఈ ఘటన తనకు తీవ్ర వేదనను కలిగించిందని పేర్కొన్నారు. ఆయన మరణం సైనిక బలగాలకు, దేశానికి తీరని లోటుగా వెల్లడించారు. అసాధారణమైన ధైర్యం, శ్రద్ధతో దేశానికి సేవ చేశారని కొనియాడారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రార్దిస్తున్నానన్నారు.